బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ కూడా రసవత్తరంగా ప్రారంభమైంది. మెల్ బోర్న్ వేదికగా మొదలైన బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆసీస్ టాపార్డర్ అదరగొట్టడంతో ఆ జట్టు భారీస్కోర్ దిశగా సాగుతోంది. చివరి సెషన్ లో భారత బౌలర్లు పుంజుకున్నప్పటకీ ఓవరాల్ గా మాత్రం కంగారూలదే ఆధిపత్యంగా చెప్పొచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. 19 ఏళ్ళ యువక్రికెటర్ శామ్ కొంటాస్ అరంగేట్రంలోనే దుమ్మురేపేశాడు. రీర్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నామనే బెరుకు లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను టార్గెట్ చేసిన ఈ యంగస్టర్..అతనిపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కొంటాస్ వన్డే , టీ20 తరహాలోనే ధనాధన్ బ్యాటింగ్‌తో భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. 65 బాల్స్‌లోనే రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 60 పరుగులు చేశాడు.
అయితే పేసర్లను ఆటాడుకుంటున్న కొంటాస్ కు రోహిత్ తన బౌలింగ్ మార్పుతో అడ్డుకట్ట వేశాడు. జడేజా బౌలింగ్ లో ఈ యువ క్రికెటర్ ఎల్బీగా దొరికిపోయాడు. ఆ తర్వాత లబుషేన్, ఖవాజా కలిసి ఆస్ట్రేలియా స్కోరును ముందుకు నడిపించారు.
క్రీజులో కుదురుకున్న వీరిద్దరు హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఖవాజాను బూమ్రా ఔట్ చేసినప్పటకీ.. లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి భారత బౌలర్లను విసిగించారు. చుక్కలుచూపించారు. లబూషేన్ ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. హెడ్ డకౌట్ తో టీమిండియాలో జోష్ పెరిగింది. అయితే స్మిత్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పార్టనర్ షిప్ తో ఆసీస్ ఇన్నింగ్స్ కాసేపు నిలకడగా సాగింది. చివర్లో ఆకాశ్ దీప్ క్యారీని ఔట్ చేసి ఆసీస్ జోరుకు బ్రేక్ వేశాడు. ఫస్ట్, సెకండ్ సెషన్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కనిపించగా మూడో సెషన్ లో టీమిండియా జోరు కొనసాగింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మిత్ 68, కమ్మిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బూమ్రా 3 వికెట్లు తీయగా…జడేజా, ఆకాశ్ దీప్ , వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పు చేసింది. గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకుంది. అలాగే రోహిత్ శర్మ ఓపెనర్ గా ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.