యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య లో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. పునర్ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తు న్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తు న్నట్లు తెలుస్తోంది. భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.
అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవన్నీ అయోధ్యకు పరుగులు తీయనున్నాయి. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుండగా, 23న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది. అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటు లోకి వస్తుంది. జనవరి 19 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా వివిధ ప్రధాన నగరాల నుంచి నడుస్తాయి. డిమాండును బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు తెలిపారు. మరోవైపు, భక్తుల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించారు. రోజుకు 50 వేల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు. జనవరి 15 నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.