మీరు 50 ఏళ్లలోపు వారా..? అయితే బీకేర్‌ఫుల్.. ఇది భయపెట్టే వార్త కాదు.. కానీ జాగ్రత్తపడమని చెప్పే న్యూస్.. లైఫ్‌స్టైల్ మార్చుకుని హ్యాపీగా ఉండమని చెప్పే ఆరోగ్యకర వార్త.
50 ఏళ్లలోపు వారిపై క్యాన్సర్ పంజా.!
బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో రీసెంట్‌గా పబ్లిష్ అయిన ఓ వార్త బాంబులా పేలింది. క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు ఏ స్థాయిలో విస్తరిస్తుందో భవిష్యత్తులో ఇది ఎంత ప్రమాదకరంగా మారబోతోందో కళ్లకు కట్టింది ఈ ఆర్టికల్. దీనిప్రకారం క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా 50ఏళ్లకు దిగువన ఉన్నవారిలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. గత మూడు దశాబ్దాల్లో 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు 79శాతానికి పైగా పెరిగాయి. 1990లో ప్రపంచవ్యాప్తంగా 50ఏళ్ల లోపు వయసున్న వారిలో 18.2లక్షల మందికి క్యాన్సర్ సోకితే 2019 నాటికి అది 32.6లక్షలకు చేరింది. ఇదే సమయంలో క్యాన్సర్ మరణాలు కూడా 28శాతం పెరిగాయి.
ఏ క్యాన్సర్లు పెరుగుతున్నాయి.?
204 దేశాల్లో 29 రకాల క్యాన్సర్లపై పరిశోధన చేసాక ఈ రీసెర్చ్‌ను సబ్మిట్ చేశారు. 50 ఏళ్లలోపు వారిలో ఎక్కువమందికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకుతోందన్నది దీని సారాంశం. శ్వాసనాళ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నట్లు గుర్తించారు. గత 30ఏళ్లలో శ్వాసనాళ, ప్రొస్టేట్ క్యాన్సర్లు ఏటా 2.28, 2.23శాతం చొప్పు పెరుగుతున్నట్లు కూడా ఈ రీసెర్చ్ తేల్చింది. లివర్ క్యాన్సర్ 2.88శాతం తగ్గింది. హెపటైటిస్-బీ వ్యాక్సినేషన్ పెరగడంతో లివర్ క్యాన్సర్ కేసుల సంఖ్య తగ్గినట్లు భావిస్తున్నారు. అయితే నాన్ ఆల్కాహాలిక్ ప్యాటీ లివర్ సమస్య కారణంగా లివర్ క్యాన్సర్ల సంఖ్యలో భారీగా తగ్గుదల లేదని చెబుతున్నారు. 2030 నాటికి క్యాన్సర్ కేసుల సంఖ్య మరో 31శాతం, మరణాలు మరో 21శాతం పెరుగుతాయని ఈ రీసెర్చ్ పేపర్ తెలిపింది. అలాగే 2030నాటికి 40ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా క్యాన్సర్ ముప్పుకు గురికావొచ్చన్నది తాజా వార్నింగ్.
మన దేశంలో.!
2022లో మన దేశంలోనే 14.6 లక్షలమంది క్యాన్సర్ బారిన పడ్డారు. 2025 నాటికి ఏటా 15.7లక్షల మంది ఏటా దీని బారిన పడొచ్చన్నది అంచనా. అంతే ప్రమాదకర రీతిలోనే క్యాన్సర్ కేసులు మన దగ్గర పెరుగుతున్నాయి.
క్యాన్సర్ కారణాలేంటి.?
వారసత్వ అంశాలతో పాటు రెడ్‌మీట్ తీసుకోవడం, ఉప్పు వినియోగం పెరగడం, పళ్లు, పాల వినియోగం తగ్గడం, మద్యపానం, పొగాకు వినియోగం వంటివి 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. క్యాన్సర్ కేసులను ప్రారంభ దశలోనే గుర్తించడం, సరైన వైద్యం అందించడం వంటి అంశాల ప్రాధాన్యతను ఈ రీసెర్చ్ గుర్తుచేస్తోంది. లైఫ్‌స్టైల్‌ను మార్చుకుని సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామానికి ప్రాధాన్యం ఇస్తే చాలా వరకు క్యాన్సర్ కేసులను తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.