ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులంటారు. కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసేలా అమలులోకి తెచ్చిన జుడీషియల్ సంస్కరణ చట్టం ఆ దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టేసింది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
న్యాయ సంస్కరణలతో ఇబ్బంది ఏంటి ?
ఇజ్రాయెల్‌కు రాజ్యాంగం లేదు. పార్లమెంట్ చేసే చట్టాల ఆధారంగా పాలన సాగుతుంది. పార్లమెంట్ చేసే చట్టాలు అభ్యంతరకరంగా ఉంటే సుప్రీంకోర్టు వాటిని కొట్టేస్తుంది. ఇప్పటి వరకు జరిగింది ఇది.. కానీ ఇకపై సీన్ మారిపోతోంది. ఏ దేశమైనా ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసం పని చేయాలి.. తప్పటడుగులు వేస్తే సరిదిద్దుకోవాలి. కానీ ఇజ్రాయెల్‌లోని బెంజిమెన్ నెతన్యాహూ ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయాలను ఇకపై ఎవరూ ప్రశ్నించకూడదనుకుంటుంది. చివరకు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టకూడదని భావిస్తోంది. అందుకే సంస్కరణల పేరుతో సుప్రీం కోర్టు అధికారాలకు కత్తెర వేస్తూ కీలక బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నా…ప్రజాప్రయోజనకరంగా లేవని సుప్రీంకోర్టు భావించినా… వాటిని రద్దు చేసే అధికారం ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఉండదు. అంటే ఇకపై ఇజ్రాయెల్‌లో సుప్రీంకోర్టు పాత్ర నామమాత్రమే. ఇది ఒక్కటే కాదు.. ఇకపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటికి తిరుగులేకుండా చేసేందుకు బెంజిమెన్ సర్కార్ కుట్రపూరితంగా చాలా సంస్కరణలను తెరపైకి తెచ్చింది
గవర్నమెంట్ వర్సెస్ సుప్రీంకోర్టు
తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన నెతన్యాహూ ప్రభుత్వం న్యాయ సంస్కరణల పేరుతో చేపట్టిన చర్యలు ప్రపంచదేశాలను కూడా నివ్వెరపరుస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేలా సుప్రీంకోర్టు అధికారాలకు కత్తెర వేయడాన్ని ఆదేశ ప్రజలు…విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేస్తే.. పార్లమెంట్ లో సింపుల్ మెజార్టీ ద్వారా సుప్రీం నిర్ణయాన్ని ఓవల్ రూల్ చేసేలా చట్టాన్ని తెస్తున్నారు. ఇకపై న్యాయమూర్తుల నియామకాల్లో కూడా ప్రభుత్వ జోక్యం పెరగబోతోంది. న్యాయమూర్తుల నియామకాల కమిటీల్లో ప్రభుత్వ ప్రతినిధులను పెంచబోతున్నారు. దీంతో ఏ కోర్టులో ఏ జడ్జ్ ఉండాలన్నది ప్రభుత్వ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఇప్పటి వరకు మంత్రులు అటార్నీ జనరల్ సూచనలతో లీగల్ అడ్వైజరీల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇకపై ఆ వ్యవస్థ కూడా ఉండదు. ఓవరాల్ గా చూసుకుంటే.. ఇజ్రాయెల్‌లో న్యాయవ్యవస్థను బొందపెట్టాలని ప్రధానమంత్రి నెతన్యాహూ నిర్ణయించుకున్నారు.
తిరుగుబాటు తప్పదా ?
న్యాయసంస్కరణల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధానాలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా దేశ ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రైట్ వింగ్ పాలనకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. సుప్రీంకోర్టు అధికారాలను తొలగించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలు ప్రశ్నించే హక్కును కూడా కోల్పోతారని ప్రజాస్వామ్య సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో సమ్మె చేసేందుకు ట్రేడ్ యూనియన్లు సిద్ధమవుతున్నాయి.