British Royal Jewels: బ్రిటన్ రాజసౌధంలోని ఆభరణాలు ఇండియావే! వెల్లడించిన ‘ది గార్డియన్‌’

బ్రిటన్ రాజప్రాసాదంలో ఉన్న సంపదపై ‘ది గార్డియన్‌’ పత్రిక సంచలన, పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. బ్రిటన్ రాజసంపదపై జరిపిన ఈ పరిశోధన ద్వారా అక్కడి సంపద అంతా ఇండియాదే అని తేలింది. దేశం నుంచి బ్రిటన్ తరలివెళ్లిన సంపదలో పంజాబ్ సంపద కూడా ఉంది.

  • Written By:
  • Updated On - April 8, 2023 / 05:24 PM IST

British Royal Jewels: భారత దేశాన్ని దాదాపు రెండు వందల ఏండ్లు పాలించిన బ్రిటీషర్లు వెళ్తూ, వెళ్తూ బోలెడంత భారతీయ సంపదను పట్టుకెళ్లారు. అంతకుముందూ సంపదను తమ దేశానికి తరలించారు. వాటిలో ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ డైమండ్ కూడా ఉంది. మరెన్నో వజ్రాభరణాల్ని కూడా తీసుకెళ్లారు. వీటిలో చాలా వరకు బ్రిటన్ రాజ వంశం చేతుల్లోనే ఉన్నాయి. అక్కడి రాజసౌధంలో చాలా భారతీయ నగలు కనిపిస్తాయి.

అక్కడున్న నగల్లో చాలా వరకు తమవే అని భారత్ వాదిస్తున్నప్పటికీ, దీనిపై బ్రిటన్ పెద్దగా స్పందించింది లేదు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగించాలంటూ కూడా భారత్ అడుగుతోంది. అయితే, నిజంగానే బ్రిటన్ రాజప్రాసాదంలోని నగలు, వజ్రాలు, ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా మంది నమ్ముతున్నట్లు భారత్‍వేనా? ఈ విషయంలో ‘ది గార్డియన్‌’ పత్రిక సంచలన, పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.
‘ది గార్డియన్‌’ కథనంలో ఏముందంటే
‘కాస్ట్‌ ఆఫ్‌ ది క్రౌన్‌’ పేరుతో ‘ది గార్డియన్‌’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. బ్రిటన్ రాజసంపదపై జరిపిన ఈ పరిశోధన ద్వారా అక్కడి సంపద అంతా ఇండియాదే అని తేలింది. భారత పురావస్తు శాఖ దగ్గర భద్రపరిచిన కొన్ని ఫైళ్లలోనూ దీనికి సంబంధించిన ఆధారాలున్నాయని, బ్రిటన్ సంపద గురించిన సమాచారాన్ని ఇవి బలపరుస్తున్నాయని ‘ది గార్డియన్‌’ కథనం తెలిపింది. ఈ కథనం ప్రకారం.. బ్రిటన్ రాజప్రాసాదంలో అనేక విలువైన సంపద ఉంది. అయితే, ఈ సంపద అంతా అక్కడికి ఎలా వచ్చింది అనే విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు అప్పట్లో క్వీన్ ఎలిజబెత్-2 నాయనమ్మ అయిన క్వీన్ మేరీ రహస్య విచారణ జరిపించింది. దీని ప్రకారం ఈ సంపద భారత్ నుంచే వచ్చిందని తేలింది. భారత సంపద బ్రిటన్ చేరిన విషయంలో అప్పట్లో ఇండియాను పాలించిన బ్రిటీష్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ‘ది గార్డియన్‌’ పేర్కొంది.


పంజాబ్ రాజ సంపద బ్రిటన్ రాజప్రాసాదంలో
దేశం నుంచి బ్రిటన్ తరలివెళ్లిన సంపదలో పంజాబ్ సంపద కూడా ఉంది. ఒకప్పటి పంజాబ్ రాజు మహారాజా రంజిత్ సింగ్ తన గుర్రాలకు అలంకరించే పచ్చలు పొదిగిన బంగారు నడికట్టు ఇప్పుడు బ్రిటన్ రాజ సౌధంలో ఉంది. కింగ్ చార్లెస్ రాయల్ కలెక్షన్‌లో ఇది ఉంది. అలాగే 224 పెద్దపెద్ద ముత్యాలతో తయారు చేసిన అరుదైన నెక్లెస్ కూడా పంజాబ్ రాజు నుంచే బ్రిటన్ చేరినట్లు ‘ది గార్డియన్‌’ పేర్కొంది. సాధారణంగా ఇలా భారత్ సహా ఇతర దేశాల నుంచి దోచుకువచ్చిన సంపదను విజయానికి చిహ్నాలుగా భావిస్తారు. ఇవన్నీ అప్పట్లో క్వీన్ విక్టోరియాకు చేరాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులే కోహినూర్ వంటి విలువైన వజ్రాల్ని దోచుకెళ్లారు. వాళ్ల ద్వారానే కోహినూర్ వజ్రం విక్టోరియా రాణికి చేరింది.
పట్టాభిషేకం వేళ తెరపైకి భారత సంపద అంశం
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 వచ్చే మే 6న పట్టాభిషిక్తుడవుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత సంపద అంశం తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి తరుణంలో పట్టాభిషేక మహోత్సవంలో భారత్ నుంచి అక్రమంగా తెచ్చిన వజ్రాభరణల్ని ధరిస్తారా? లేదా? అనే అంశంపై సందేహం ఏర్పడింది. ఈ వేడుకల వేళ గతంలో ఇలాంటి ఆభరణాల్ని ధరించే వాళ్లు. అయితే, ఈసారి పాత సంప్రదాయాన్ని పక్కనబెడతారని, ఈ ఆభరణాల్ని ధరించకపోవచ్చని తెలుస్తోంది.

కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని క్వీన్ కెమిల్లా ధరించకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారత్ నుంచి తెచ్చిన ఆభరణాల్ని ధరించకపోవడం ద్వారా బ్రిటన్-ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తకుండా ఉంటుందని బ్రిటన్ భావిస్తోంది. అందుకే పట్టాభిషేకంలో భారత వజ్రాభరణాలు ధరించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా ఇండియాకు విజయంగానే చెప్పుకోవాలి. అయితే, ఈ ఆభరణాలు ఇండియావే అని తేలినప్పటికీ, వాటిని బ్రిటన్.. భారత్‌కు అప్పగిస్తుందా.. లేదా.. అనేది కాలమే నిర్ణయిస్తుంది.