భారత్ తో చివరి 2 టెస్టులు, ఆసీస్ జట్టులో 19 ఏళ్ళ ఓపెనర్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టెస్టులో టీమిండియా గెలిస్తే.. తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా అడిలైడ్ లో విజయం సాధించింది. ఇక మూడో టెస్ట్ వర్షంతో డ్రాగా ముగిసింది. ప్రస్తుతం సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలిచేందుకు ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 06:49 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టెస్టులో టీమిండియా గెలిస్తే.. తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా అడిలైడ్ లో విజయం సాధించింది. ఇక మూడో టెస్ట్ వర్షంతో డ్రాగా ముగిసింది. ప్రస్తుతం సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలిచేందుకు ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మెల్ బోర్న్, సిడ్నీ మ్యాచ్ లకు తమ జట్టులో మార్పులు చేసింది. జట్టులోకి కొత్తగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంది. వరుసగా మూడు టెస్ట్‌ల్లో విఫలమైన ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీపై వేటు పడింది. అతని స్థానంలో యువ ఓపెనర్‌ సామ్ కోన్‌స్టాస్ కు అవకాశమిచ్చింది. కోన్ స్టాస్ జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. 19 ఏళ్ల ఈ కుర్రాడు ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. జూనియర్ పాంటింగ్ కు పేరున్న కోన్ స్టాస్ 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 42.23 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.

అలాగే భారత్‌ ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ఏ తరఫున 73 రన్స్‌తో చెలరేగాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ అడుగుపెట్టిన ఈ యువ సంచలనం.. సిడ్నీ థండర్‌ తరఫున అరంగేట్రంలోనే ఫాస్టెస్‌ ఫిఫ్టీ బాదాడు. సామ్ కోన్‌స్టాస్‌తో పాటు జై రిచర్డ్‌సన్, బ్యూ వెబ్‌స్టర్ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా గాయంతో జోష్ హజెల్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మూడో టెస్ట్ నాలుగోరోజు గాయంతోనే హ్యాజిల్ వుడ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో సిరీస్ నుంచి కూడా వైదొలగక తప్పలేదు. హ్యాజిల్ వుడ్ స్థానాన్ని జై రిచర్డ్‌సన్ భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో టాపార్డర్‌ తడబడటంతోనే మార్పులు చేశామని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు.

ఇదిలా ఉంటే గబ్బా టెస్టులో టెయిలెండర్ల అద్భుత పోరాటంతో భారత్ ఓటమిని తప్పించుకోగలిగింది. ఆకాశ్ దీప్, బుమ్రా పట్టుగలగా ఆడి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. తర్వాత ఆసీస్ ను భారత పేసర్లు దెబ్బతీయగా… రెండో ఇన్నింగ్స్ లో చివరిరోజు వర్షం అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచిన జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుతుంది.