లంచం అంటే లంచం కాదు.. రహస్య ఒప్పందం.. నాకు అదిస్తే నీకు ఈ సాయం చేస్తా అన్నది పాక్‌తో అమెరికా కుదుర్చుకున్న డీల్. పాకిస్థాన్ ఇటీవలి వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమయంలో ఐఎంఎఫ్ నుంచి నిధుల కోసం నానా తంటాలు పడింది. కాళ్లు పట్టుకుంది. చివరకు ఐఎంఎఫ్ సాయం చేయడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే ఇందుకోసం అమెరికాతో పాక్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందన్నది లేటెస్ట్ హాట్‌టాపిక్.
ట్విస్ట్ ఏమిటంటే పాక్ తమకు ఆయుధాలు సరఫరా చేస్తే తాము ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ ఇప్పిస్తామని అమెరికా బేరాలాడినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆయుధ పరంగా పాక్ కంటే ఎంతో ముందున్న అమెరికా అసలు పాక్ నుంచి ఆయుధాలు సేకరించాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే అమెరికా తనకోసం కాదు ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా కోసం పాక్ నుంచి వాటిని సేకరించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్ దగ్గర భారీగా ఆయుధాలు అయితే లేవు. కానీ కొన్ని రకాల ఉత్పత్తులకు మాత్రం పాక్ కేంద్రం. మందుగుండు, మోర్టార్ షెల్స్ తయారీకి ఇది హబ్. ఉక్రెయిన్‌కు అవి అత్యవసరం. అమెరికా ఒత్తిడితో పాక్ వాటి సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసింది. ఉక్రెయిన్ వాటిని రష్యాతో యుద్ధంలో వినియోగించింది.
పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ ఉన్నప్పుడు తటస్థ వైఖరి అవలంభించారు. ఆ తర్వాత రష్యాకు మద్దతుగా మాట్లాడారు. దీంతో అమెరికా ఇమ్రాన్‌ను పదవి నుంచి తప్పించేందుకు సాయం చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆర్థిక సుడిగుండాన్ని ఎదుర్కోలేకపోయింది. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. మీకు అప్పుకావాలంటే మాకు ఆయుధాలు ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంపై అటు పాక్ కానీ, ఇటు అమెరికా కానీ నోరు తెరవలేదు. కానీ రెండు దేశాల్లో అందుబాటులో ఉన్న పత్రాలు మాత్రం డీల్ జరిగిందని చెబుతున్నాయి.