CM kcr: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే.. ఆ మంత్రికి ఈసారి టికెట్ గల్లంతేనా ?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2018లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి.. విపక్షాలకు ఝలక్ ఇచ్చిన కేసీఆర్‌.. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 03:04 PM IST

హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా.. అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తున్నారు కేసీఆర్‌. ఇందులో భాగంగా ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 17న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2018లో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లి.. విపక్షాలకు ఝలక్ ఇచ్చిన కేసీఆర్‌.. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఓవైపు నిఘా వర్గాల ఇంటలిజెన్స్‌ నివేదికలను తెప్పించుకుంటూనే. మరోవైపు ప్రైవేటు సర్వే సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐప్యాక్ టీమ్‌తోనూ ప్రత్యేకంగా సర్వే చేయించారు. ఆయన రిపోర్టులో నెగిటివ్‌ వచ్చినవారిని ఇప్పటికే ప్రగతిభవన్‌కు పిలిపించి.. కేసీఆర్ క్లాస్‌కూడా తీసుకున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆగస్ట్‌ నెలాఖరునాటికే.. సగానికి పైగా అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్‌ అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది.

అధిక మాసం కావడంతో సెంటిమెంట్‌పరంగా ఆలోచన చేస్తున్నారని.. లేదంటే ముందుగానే ఏకంగా 87సీట్లకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించేవారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సిట్టింగ్‌లందరికీ ఛాన్స్ వస్తుందా లేదంటే ఎవరినైనా తప్పిస్తారా అనే చర్చ జరుగుతోంది. సిట్టింగ్‌ల్లో ఎవరిని తప్పించినా.. వారంతా ప్రత్యర్థి పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. దీంతో వారికి ముందుగానే ఓ మాట చెప్పి, భవిష్యత్‌పై భరోసా కల్పించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తొలి జాబితాలో ఒకరిద్దరు మంత్రుల పేర్లు ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ మంత్రికి సంబంధించిన అభ్యర్థిత్వంపై ఎన్నిసార్లు సర్వేలు జరిపించినా.. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించినా.. ప్రతికూల నివేదికలు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఆ మంత్రి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న విపక్ష పార్టీ నాయకుడిని… బీఆర్ఎస్‌లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిని ఇబ్బంది పెట్టకుండా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ- చేయించడమా లేదా ఎమ్మెల్సీగా అవకాశమివ్వడమో చేయాలన్న ప్రతిపాదన కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నారని తెలుస్తోంది.