Steel Bridge: సౌత్ ఇండియాలోనే పొడవైన స్టీల్ బ్రిడ్జ్ మన హైదరాబాదులోనే..!

తెలంగాణలో రోజుకో వింత కట్టడం కళ్లకు కనిపిస్తుంది. మన్నటి వరకూ మహాసౌధం తెలంగాణ సెక్రటరేట్, నిన్న అమరవీరుల జ్యోతి నగర అందాలకు మరింత వన్నె తెచ్చాయి. వీటి కోవలోకి మరో అద్భుతమైన కట్టడం చేరనుంది. అదే ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకూ నిర్మించిన ఉక్కువంతెన. దీనిని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - August 9, 2023 / 01:20 PM IST

హైదరాబాద్ అనగానే జంటనగరాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడి ట్రాఫిక్ తిప్పలు మామూలుగా ఉండదు. ఒక్కసారి ఆఫీసులకు వెళ్లే సమయంలో చూడాలి ఏ సిగ్నల్ చూసినా కార్లతో, ఆటోలతో, బైకులతో నిండిపోయి ఉంటుంది. దీంతో టైంకి ఆఫీసుకు వెళ్ళలేక తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు నగరప్రజలు. వీరందరినీ దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జ్ ని నిర్మించారు. ఈ వంతెన ద్వారా ప్రయాణించడం వల్ల విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ట్యాంక్ బండ్, సచివాలయం మధ్య వెళ్ళే వారికి ట్రాఫిక్ కష్టాలు కాస్త తప్పనున్నాయి. వీఎస్టీ నుంచి బయలుదేరితే కేవలం నాలుగు నిమిషాల్లో ట్యాంక్ బండ్ చేరుకోవచ్చు అని అంటున్నారు అధికారులు. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ సర్కిల్ మీదుగా ప్రతిరోజూ లక్షల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇలా నాలుగు సర్కిళ్ళను దాటుకొని ట్రాఫిక్ లో చిక్కుకునే అవసరం లేకుండా దీనిని ఏర్పాటు చేశారు. 95 శాతం వరకూ పనులు పూర్తి అయ్యాయి. పెయింటింగ్ వర్క్ జరుగుతున్నందున ఈనెల ఆఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. 

ప్రాజెక్ట్ వివరాలు ఇవే..

జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ అత్యంత పెద్ద కట్టడానికి దాదాపు రూ. 450 కోట్లు అంచనా వ్యయంగా కేటాయించారు. స్ట్రాటజికల్ రోడ్స్ డెవలప్మెంట్ లో భాగంగా ఎస్ఆర్టీపీ వంతెన రూపొందించారు. ఈ వంతెన 26.54 మీటర్ల ఎత్తు లో నిర్మించారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన సర్వే ప్రకారం ఆశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వెడల్పు కేవలం 80అడుగులు ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా కాంక్రీట్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలంటే కనీసం 100 అడుగుల వెడల్పు అయినా ఉండాలని సర్వే టీం సూచించారు. అందుకే ఇక్కడ కాంక్రీట్ నిర్మాణం కంటే కూడా స్టీల్ వంతెన నిర్మాణం త్వరగా నిర్మించేందుకు వీలుంటుందని ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2020, జూలైలో శంకుస్థాపన చేయగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2021లో బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2022 తరువాత ఉక్రెయిన్, రష్యా వార్ కారణంగా సరైన సమాయానికి ఉక్కు హైదరాబాద్ కు సరఫరా కాలేదు. దీంతో కొన్ని నెలల పనులు నెమ్మదిగా సాగాయని తెలిపారు అధికారులు. ఇది ఉక్కు వంతెన కావడంతో ఎండాకాలంలో ఎక్కువగా వేడెక్కే ప్రమాదం ఉంది. తద్వారా కొన్నేళ్ళ తరువాత నిర్మాణంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటివి జరుగకుండా నిపుణుల పర్యవేక్షణలో సలహాలు తీసుకొని వీటిని నిర్మించినట్లు ఇంజనీర్లు తెలిపారు.

ప్రత్యేకతలు..

  • బ్రిడ్జ్ పొడవు 2.62 కిలోమీటర్లు
  • ఫోర్ లైన్స్ వంతెన
  • స్టీలు పిల్లర్ల సంఖ్య 81
  • ఉక్కు దూలాలు 426 (పొడవు, వెడల్పు)
  • వినియోగించిన ఉక్కు 12,316 మెట్రిక్ టన్నులు
  • సౌత్ ఇండియాలో రోడ్డుపై నిర్మించిన మొదటి పొడవైన స్టీల్ వంతెన
  • జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి భూసేకరణ లేకుండా చేపట్టిన నిర్మాణం
  • దేశంలో మొట్టమొదటిసారి మెట్రో రైల్వే ట్రాక్ మీదుగా నిర్మించిన పొడవాటి బ్రిడ్జ్

T.V.SRIKAR