బుల్ రంకెలేస్తోంది. ఆ మధ్య బేర్స్ దెబ్బకు బేర్ మన్న బుల్ మళ్లీ దూకుడుగా వెళుతోంది. ఇంట్రాడేలో 19011పాయింట్లను తాకిన నిఫ్టీ చివరకు 18972 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. 64,050 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 63,915 దగ్గర ముగిసింది. గత రికార్డు 18,887 మార్కును బద్దలు కొట్టడానికి నిఫ్టీకి వారం రోజులు పట్టింది. నెలవారీ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగింపు, గరిష్టాలతో ప్రాఫిట్ బుకింగ్‌తో చివర్లో మార్కెట్లు కాస్త తగ్గాయి. అయితే నిఫ్టీ కీలకమైన మద్దతుస్థాయి 18వేల 9వందలకు ఎగువన ముగిసింది.
నిఫ్టీ దూకుడు మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 18వేల 9వందలకు ఎగువన ఉండటంతో త్వరలోనే 19250 వరరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌కు ఆస్కారం ఉందన్నది నిపుణుల లెక్క. ఒకవేల 19150 మార్క్‌ను కనుక ఇదే ఊపులో అందుకుంటే మాత్రం త్వరలోనే 19500 పాయింట్‌ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 65వేల టచ్ చేసే రోజు ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు. సెన్సెక్స్ 2021 సెప్టెంబర్ 24న తొలిసారి 60వేల మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత నాలుగువేల పాయింట్లు పెరగడానికి 21 నెలలు పట్టింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంత సమయం పట్టింది. 50వేల 60వేల మార్కును అందుకోవడానికి పట్టిన సమయం కేవలం 8నెలలు మాత్రమే. నిఫ్టీది అదే పరిస్థితి. 2021లో నిఫ్టీ సుమారు మూడున్నర వేల పాయింట్లు అంటే 24శాతం పెరిగింది. కానీ 2022లో నిఫ్టీ పెరిగింది కేవలం 750 పాయింట్లే. అంటే వృద్ధి కేవలం 4.32శాతం మాత్రమే.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లకు అన్ని అంశాలు కలసి వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. పుంజుకోవడం, పడిపోవడం మామూలైపోయింది. అమెరికా ఫెడ్ క్రమం తప్పకుండా వడ్డీరేట్లను పెంచడం కూడా దెబ్బతీసింది. విదేశీ మదుపరులు అటు మళ్లారు. దీంతో దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే గత కొంతకాలంగా పరిస్థితి మారింది. దేశీయ మార్కెట్లపై విశ్వాసం మళ్లీ పెరిగింది. దీంతో ఎఫ్‌ఐఐలు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్నారు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడం కూడా సెంటిమెంట్‌ను పెంచింది. వర్షపాతం కాస్త తక్కువ ఉంటుందన్న అంచనాలను మార్కెట్లు ఇప్పటికే జీర్ణించుకున్నాయి. మదుపరుల విశ్వాసం పెరిగిందనడానికి గత మూడునెలలుగా దేశీయ మార్కెట్ల పెరుగుదలే కారణం. ఈ మూడు నెలల్లో నిఫ్టీ 11, సెన్సెక్స్ 10శాతం పెరిగాయి.
ప్రస్తుతం మదుపరులు ఆచితూచి అడుగేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నా సరైన షేర్లలోనే పెట్టుబడులు పెట్టాలంటున్నారు. మార్కెట్లు తగ్గినప్పుడు కొనాలి, ఇంకా తగ్గితే యావరేజ్ చేయాలన్న సూత్రాన్ని మాత్రం నిత్యం గుర్తుపెట్టుకోవాల్సిందే.