Tomato price: ఎర్ర బంగారంలా మారిన టమాటా.. రానున్న రోజుల్లో కిలో రూ. 150కి చేరే అవకాశం.?

టమాటా లేనిదే ఒక్క రోజు వంట గడవని పరిస్థితి ప్రతి ఒక్క ఇంట్లో నెలకొంది. అలాంటి టమాటాకు ఒక్కసారిగా ధర పెరిగింది. ఎర్రటి పండు ధర నిప్పు కణంలా మండిపోతోంది. మన్నటి వరకూ కిలో రూ. 30 - 40 ఉన్న దీని ధర అమాంతం వంద రూపాయలకు ఎగబాకింది. మన దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలాగే కనిపిస్తుంది. జాతీయ మార్కెట్ ప్రభావం, వాతావరణ మార్పులు, సరఫరాలో తలెత్తే సమస్యల కారణంగా వీటి ధరలకు రెక్కలొస్తున్నాయని చెప్పాలి. దేశ వ్యాప్తంగా వీటి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం.

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 08:00 PM IST

జాతీయ మార్కెట్లో ధరలు ఇలా..

మనదేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర కిలో రూ. 80 నుంచి 90 పలుకుతుంది. ఇది హోల్ సేల్ ధర మాత్రమే. ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్ఫూర్లో హోల్ సేల్ ధర రూ. 80 పలుకగా.. రిటైల్ మార్కెట్లో వంద పైనే విక్రయిస్తున్నారు. వాస్తవానికి కాన్సూర్ లో వీటి ఎగుమతి తక్కువ. బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటారు. అలాంటి శీతల ప్రాంతం కర్నాటకలో ఈ టమాటా ఎర్ర బంగారంగా మారింది. రానున్న రోజుల్లో దీని ధర రూ 150 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నాయి వ్యాపార వర్గాలు. అలాగే దేశ వాణిజ్య రాజధానిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్ కంటే కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ముంబై హోల్ సేల్ మార్కెట్లో రూ. 60 పలుకగా రిటైల్ మార్కెట్లో రూ. 100 కు చేరుకుంది. గత వారం వరకూ ముంబయి, బెంగళూరులో కిలో టమాటా ధర రూ. 30 -50 గా ఉండేది. కానీ ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి..

మన తెలంగాణ, ఏపీల్లోనూ దీని ప్రభావం తీవ్రంగా పడింది. సప్లై తగ్గడంతో డిమాండుకు తగ్గ నిలువలు మన మార్కెట్ లో లేవు. దీని కారణంగా కూడా టమాటా ధర పెరిగింది. పైగా దళారీల దందా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. సాధారణంగా టమాటా సాగు దేశంలోని కొన్ని ప్రదాన పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందులో తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లు ప్రధమ స్థానంలో ఉంటాయి. మిగిలిన రాష్ట్రాల్లో వీటి సాగు అంతగా ఉండదు. మన్నటి వరకూ గుజరాత్, ఒడిశా, ఏపీ ప్రాంతాల్లో వచ్చిన వాతావరణ మార్పులు తీవ్రం ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా పంట నీటిలో మునిగిపోవడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తద్వారా ఉన్న సరుకును ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కారణంగా వీటికి రెక్కలు వచ్చాయని చెప్పాలి.

కిలో ధర రూ. 150 అయ్యే అవకాశం..

దీనిపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నియంత్రణా విభాగం అత్యవసర సమీక్షను ఏర్పాటు చేసింది. దేశంలోని టమాటా ధరలపై చర్చించింది. వీటి ధరల నియంత్రణ కోసం చర్యలు చేపట్టింది. మన్నటి వరకూ రూ. 25 నుంచి 41 మధ్య ఉన్న ధరలు తాజాగా రిటైల్ మార్కెట్ లోనే రూ. 115 పలుకుతున్నట్లు అంచనా వేసింది. దీనికి గల ముఖ్య కారణం వాతావరణ ప్రతికూలత వల్ల వచ్చిన పంట నష్టం, రవాణా అంతరాయంగా గుర్తించింది. పరిస్థితులు సర్థుమణిగే వరకూ వీటి హెచ్చుదల తప్పదని తెలిపింది. రానున్న రోజుల్లో టమాటా మరింత ఎక్కువ రూ. 150 ధర పలికే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

T.V.SRIKAR