Congress CWC Meeting: ఢిల్లీ వేదికగా అక్టోబర్ 9న సీడబ్యూసీ సమావేశం.. చర్చించబోయే అంశాలు ఇవే

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు. మూడు నెలల వ్యవధిలో నాలుగోసారి. నాయకులతో తరచూ సంప్రదింపులు.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 07:59 AM IST

కాంగ్రెస్ గత కొన్ని నెలలుగా రాజకీయపరమైన అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో రాష్ట్రాల వారీగా భారీ బహిరంగసభలు ఒక ఎత్తైతే.. రాష్ట్రంలోని కీలకమైన నాయకులతో సమావేశాలు మరో ఎత్తుగా చెప్పాలి. మన్నటి వరకూ తెలంగాణలో గ్యారెంటీ స్కీమ్స్ పేరుతో జనాలను ఆకర్షించేందుకు బాగానే కసరత్తు చేసింది. అందులో భాగంగానే అక్కడి నాయకులతో కూడా సమావేశాలు జరిపి లోపాలను సరిదిద్దుకునే చర్యలు చేపట్టింది. దీనికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని వేదికగా చేసుకుంది. గతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సారి ఢిల్లీ వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ముఖ్య నాయకులు ఈనెల 9న ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.

చర్చించబోయే అంశాలు..

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరాం లలో మరో ఒకటి రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదపాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అందుకు తగు వ్యూహాలు, ప్రణాళికలు, లక్ష్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటూ ఇండియా కూటమి పేరుతో విపక్షాలతో పొత్తులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకునేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో ప్రచారాలకు సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ ను కూడా సిద్దం చేసేందుకు సిద్దమైంది. తాజాగా తెరపైకి వచ్చిన కులగణన అంశాన్ని కూడా పరిగణించనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని అధికార బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఖండించేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. లోక్ సభ సాక్షిగా తీసుకొచ్చిన మహిళా బిల్లు అమలు, అందులోని లోపాలపై చర్చించనున్నట్లు సమాచారం.

కీలక నిర్ణయాలు ఇవే..

ఇదంతా రానున్న ఎన్నికల పై వ్యూహాస్త్రాలను ఎక్కుపెట్టడంలో ఒక భాగం అని చెప్పాలి. అయితే చత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్. దానికి రానున్న రోజుల్లో కూడా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనే అంశంపై కొన్ని నిర్ణయాలు తీసుకోనుంది. అయితే తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి దశాబ్ధం పాటు అధికారం కాదు కదా సరైన స్థాయిలో సీట్లను కూడా గెలుచుకోలేదు కాంగ్రెస్. దీనికి గల కారణాలు, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయాన్ని తీసుకోనుంది. అలాగే ప్రస్తుత పాలకుల వైఖరిని ఎండగట్టి.. ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం సాధించేందుకు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. మధ్యప్రదేశ్లో కూడా అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ సీడబ్యూసీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాత్మక చర్యలు తీసుకుందో తెలియాలంటే వచ్చే ఎన్నికల ప్రచారం వరకూ వేచి చూడాల్సిందే.

T.V.SRIKAR