ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి ఈరోజు నుంచి ప్రారంభమై శనివారం వరకూ కొనసాగవచ్చని అంచనా వేశారు. తెలంగాణ చుట్టుపక్కల జిల్లాలే కాకుండా హైదరాబాద్ లోనూ సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం వరకూ విస్తారంగా వానలు కురుస్తాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
ఏపీలోనూ వర్షాలు
తెలంగాణలో ఇలా ఉంటే ఏపీలో మన్నటి వరకూ కొనసాగిన వానలు ఇప్పుడే కాస్త ఉపశమనాన్నిచ్చింది. ఇదిలా ఉంటే.. ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని కారణంగా పశ్చిమ మధ్య బంగాళా ఖాతం నుంచి వాయూవ్య దిశగా పయనిస్తోంది. దీని కారణంగా అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది క్రమక్రమంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. అలాగే నైరుతి రుతుపవనాలు మధ్యప్రదేశ్ నుంచి ప్రయాణించి ఆవర్తనంలోని మరో ద్రోణికి చేరుతోందని వివరించింది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల ఉత్తరకోస్తాతోపాటూ రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని సూచిస్తోంది. మత్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తోంది.