అది 1990.. అక్టోబర్ 30. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. జై శ్రీరామ్ నినాదాలు ఓవైపు.. తుపాకీ శబ్దాలు మరోవైపు.. ఎక్కడ చూసినా హింస.. ఎక్కడ చూసినా ఆందోళన.. ఆ సమయంలో అయోధ్య అట్టుడికిపోతోంది. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ.. ఆ రోజు సంఘటనను ఇప్పుడు దేశమంతా గుర్తు చేసుకుంటోంది. 1990 అక్టోబర్ 30న అయోధ్య కరసేవకులు.. బాబ్రీ మసీదు వైపు దూసుకొచ్చారు. వారిని కట్టడిచేయడానికి అప్పటి ములాయం ప్రభుత్వం.. 28వేల మందికి పైగా పోలీసులను ఏర్పాటు చేసింది. ఎంతటి భద్రత అంటే.. బాబ్రీ మసీదు వెళ్లే మార్గం అంతా ఖాకీలతోనే నిండిపోయేంత! బాబ్రీ మసీదు వైపు దూసుకొచ్చిన రామమందిర కరసేవకులు.. పోలీసులతో యుద్ధానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
వాటన్నింటిని తట్టుకొని.. కొందరు కరసేవకులు బాబ్రీ మసీదు వైపు దూసుకెళ్లారు. బాబ్రీ మసీదు గోడలు దాటిన కొందరు.. కాషాయ జెండాలను ప్రతిష్టించారు. దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. కరసేవకుల మీద కాల్పులు జరిపారు. బాబ్రీ మసీదు గోడల మీద.. ఆ మసీదు డోముల మీద ఉన్న కాషాయ జెండాలను తొలగించారు. మసీదు మధ్య డోమ్ మీద జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ చాలామంది కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. మసీదు మధ్య గోపురంపై జెండాను పట్టుకొని ఉన్న ఓ కోతి.. గంటల పాటు అక్కడే కూర్చుంది. అప్పుడు అది వానరంలా కాదు.. హనుమంతుడి రూపంలా కనిపించింది. గంటలకు గంటలు.. పరిస్థితి సద్దుమణిగే వరకు ఆ కోతి.. కాషాయ జెండాను పట్టుకొని.. ఆ మసీదు మధ్య గోపురం మీద అలానే కూర్చొనే ఉంది. కరసేవకులను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు అని.. రాములోరికి నీడనిచ్చేందుకు ఎలాంటి పోరాటం చేయాలో.. కోతి రూపంలో ఆ అంజనీ సుతుడే వచ్చి చెప్పాడని.. ఆ సన్నివేశం చూసిన ప్రతీ ఒక్కరు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.
ఇక అయోధ్య వ్యవహారంలో కోర్టు తీర్పు ఇచ్చే ప్రతీసారి.. ఓ నల్లకోతి న్యాయస్థానం మీదకు ఎక్కి… ఏం జరుగుతుందా అని చూసేదట. తీర్పుతో నిరాశ ఎదురైన ప్రతీసారి.. ఎన్ని ప్రసాదాలు పెట్టినా తినకుండా ఆ కోతి అలాగే మౌనంగా వెళ్లిపోయేదట. 2019లో రామమందిర నిర్మాణం కోసం 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్టుకు అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చిన నెక్ట్స్ డే.. ఆ కేసు వాదించిన పరాశరన్ ఇంటికి.. దాదాపు 30, 40 కోతులు వచ్చాయట. ఇలా అయోధ్యకు సంబంధించి ప్రతీ మలుపులోనూ.. కోతులు కీలకంగా మారాయ్. ఆ ఆంజనేయుడే ఈ రూపంలో వచ్చి.. అయోధ్య పోరాటాన్ని.. కలను, ఆశను ముందుకు తీసుకెళ్లాడని.. భక్తులు నమ్ముతుంటారు.