Ayodhya Ram Mandiram : అయోధ్య పిలుస్తోంది.. రామయ్యా వస్తావయ్యా

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. 2024 జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. 2024 జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2 వేల 5 వందల ఏళ్లు తట్టుకుని నిలబడేలా ఈ ఆలయాన్ని డిజైన్‌ చేశారు. ఆలయానికి ఉపయోగించే భారీ తలుపులను హైదరాబాద్‌తో తయారు చేయించారు. ధ్వజస్థంభానికి ఉపయోగించే భారీ గంటలు కూడా ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. ఇక భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మించారు. అష్టభుజి ఆకారంలో గర్భ గుడిని తీర్చిదిద్దారు. గర్భ గుడి అష్టభుజి ఆకారంలో ఉన్న అతి తక్కువ దేవాలయాల్లో అయోధ్య రామాలయం కూడా ఒకటి కానుంది.

ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్‌ చేశారు. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35వేల నుంచి 40వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని కూడా గ్రాండ్‌ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహాన్ని 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య ప్రతిష్ఠించబోతున్నారు.
ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రానున్నారు.
అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వేశాఖ.

దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఈ రైళ్లు అయోధ్యకు పరుగులు తీయనున్నాయి. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుండగా, 23న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది. అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటు లోకి వస్తుంది. జనవరి 19 నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి. డిమాండును బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు, భక్తుల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించారు. రోజుకు 50 వేల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు. ప్రధాని మోదీ స్వయంగా దీన్ని ప్రారంభించారు. హిందువులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామదర్శన భాగ్యం త్వరలోనే అందరికీ దక్కబోతోంది.