అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న అక్క.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చెల్లేమో పరార్ అయింది. ఓ కుర్రాడితో బస్టాండ్‌లో కనిపించింది. ఒక్క రాత్రి ఆ కుటుంబంలో నింపిన విషాదం అంతా ఇంతా కాదు. ఓ కూతురు అనుమానాస్పద రీతిలో చనిపోగా, మరో కూతురు కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కూతుర్లిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారని నమ్మి.. తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఐతే రాత్రి ఏం జరిగిందో తెలీదు.. పెద్దకూతురు ఇంట్లో శవమై తేలగా.. చిన్నకూతురు ఓ యువకుడితో వెళ్లిపోయింది. ఇలా ఇద్దరు కూతుళ్లు దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం బీమునిదుబ్బలో నివాసముండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దకూతురు దీప్తి సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. చిన్నకూతురు చందన బీటెక్ పూర్తిచేసి ఇంటి దగ్గరే ఉంటోంది. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటున్నాడు. ఆనందంగా సాగుతున్న వీరి జీవితం ఒక్క రాత్రి పూర్తిగా మారిపోయింది. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని.. శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఇంటి నుంచే పనిచేస్తున్న పెద్దకూతురు దీప్తి.. చిన్నకూతురు చందన ఒకరికొకరు తోడుగా ఉండడంతో.. రాత్రికి బంధువుల ఇంట్లోనే ఉన్నారు తల్లిదండ్రులు. ఆ రాత్రి ఏమైందో తెలీదు.. దీప్తి ప్రాణాలు కోల్పోగా, చందన కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి సోఫాలో కూతురు మృతదేహం కనిపించింది.
చిన్నకూతురు గురించి ఎంత వెతికినా జాడ కనిపించలేదు. ఇలా ఇద్దరు కూతుళ్లు ఒకేసారి దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంట్లో మద్యం బాటిళ్లు ఉండడం రకరకాల అనుమానాల తావిస్తోంది. కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. చందన తెల్లవారుజామున ఓ యువకుడితో కనిపించింది. దీంతో ఈ ఇద్దరూ కలిసే దీప్తిని చంపి పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐతే పెద్ద కూతురును చిన్న కూతురే చంపి ఉంటుందన్న పోలీసుల అనుమానాన్ని తల్లిదండ్రులు మాత్రం నమ్మడం లేదు. దీంతో పోలీసులు దీప్తిది అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందనతో పాటు వున్న యువకుడు ఎవరు… వారిద్దరూ ఎక్కడికి వెళ్లారు అన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారు దొరికితేనే దీప్తి మిస్టరీ వీడనుంది.