మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈ నెల 23న నార్కోటిక్స్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడు హీరో నవదీప్. విచారణకు రాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్వయంగా విచారణకు వచ్చాడు. దాదాపు 6 గంటల పాటు నవదీప్‌ను అధికారులు విచారించారు. రామ్‌చందర్‌తో సంబంధాలు, ఫోన్ సంభాషణ, లావాదేవీల గురించి నవదీప్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. అధికారులకు తాను పూర్తిస్థాయిలో సహకరించానంటూ చెప్పాడు నవదీప్. రామ్ చందర్ తనకు పాత స్నేహితుడు మాత్రమే అని.. తనతో చేసిన లావాదేవీలు వేరే విషయాలకు సంబంధించినవి అంటూ చెప్పాడు. తనను కేవలం సాక్షిగా మాత్రమే విచారించండని.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
నిజానికి ఈ ఇష్యూలో నవదీప్ పేరు బయటికి రావడానికి ముఖ్య కారణం అతని ఫోన్. కాల్స్, వాట్సాప్ చాటింగ్ ద్వారా ఈ కేసులో నవదీప్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు గుర్తించారు అధికారులు. దీంతో నవదీప్ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ కూడా నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఫోన్‌లోని కాల్ హిస్టరీ ఆధారంగా కూడా నవదీప్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారట అధికారులు. ప్రస్తుతం నవదీప్ వాట్సాప్ చాట్‌ను బ్యాకప్ చేసే పనిలో ఉన్నారట. ఈ డేటా బయటికి వచ్చిన తరువాత మరోసారి నవదీప్‌ను విచారణకు పిలిచే అవకాశమున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఓ సారి నవదీప్ మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కేసులో ఆయన పేరు రావడం సంచలనంగా మారింది.