జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

ఐసీసీలో చాలారోజుల తర్వాత పూర్తిస్థాయిలో బీసీసీఐ హవా మొదలవుతోంది. నిజానికి ప్రపంచ క్రికెట్ లో అటు ఆటలోనూ, ఇటు ఆదాయంలోనూ భారత్ ది ప్రత్యేక స్థానం.. అత్యంత ధనిక బోర్డుగా , తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఐసీసీకి అత్యధిక ఆదాయం అందించే దేశంగా భారత్ కు పేరుంది.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 02:35 PM IST

ఐసీసీలో చాలారోజుల తర్వాత పూర్తిస్థాయిలో బీసీసీఐ హవా మొదలవుతోంది. నిజానికి ప్రపంచ క్రికెట్ లో అటు ఆటలోనూ, ఇటు ఆదాయంలోనూ భారత్ ది ప్రత్యేక స్థానం.. అత్యంత ధనిక బోర్డుగా , తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఐసీసీకి అత్యధిక ఆదాయం అందించే దేశంగా భారత్ కు పేరుంది. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పొవార్, శశాంక్ మనోహర్, శ్రీనివాసన్ ఐసీసీలో చక్రం తిప్పారు. ఇప్పుడు మరోసారి ఆ అవకాశం బీసీసీఐ సెక్రటరీ జైషాకు దక్కింది. 35 ఏళ్ళ ఐసీసీ బాస్ గా ఎన్నికై రికార్డు సృష్టించిన జైషా ఎంట్రీతో పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ కు చెక్ పడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తోక జాడిస్తోంది. టోర్నీలో ఆడుతున్న 8 జట్లలో ఏడు పాక్ వెళ్ళేందుకు దాదాపు అంగీకరించినా.. భారత్ మాత్రం నో చెప్పింది. పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని ఐసీసీకి తేల్చి చెప్పేసింది. తమ మ్యాచ్ లు హైబ్రిడ్ మోడల్ విధానంలో తటస్థ వేదికలో నిర్వహించాలని కూడా విజ్ఞప్తి చేసింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిని ఒప్పుకోకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు అత్యుత్సాహానికి ఐసీసీ ఛైర్మన్ హోదాలో జైషా చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లను తటస్థ వేదికలకు మారడం ఖాయమైనట్టే.

ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ లో ఈ మెగా టోర్నీ నిర్వహించడం తప్పిస్తే పాక్ కు మరో మార్గం లేదు. ఒకవేళ భారత్ టోర్నీ నుంచి వైదొలిగితే అది ఆతిథ్య జట్టుకే కాదు ఐసీసీకి కూడా భారీ నష్టాన్ని మిగులుస్తుంది. అందుకే గతంలో ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు.