Delhi Police: సినిమా రేంజ్ లో హత్య చేసిన రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి.. 20 ఏళ్ల తరువాత గుర్తించిన పోలీసులు

20 ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. బాలేశ్ కుమార్ అనే నిందితుడు అమర్ సింగ్ గా పేరు మార్చుకుని ఎలాంటి ఘాతుకాలకి పాల్పడ్డాడో వివరించారు. అరెస్ట్ అయిన నిందితుడు గతంలో రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగిగా తెలిపారు.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 11:04 AM IST

మనం కొన్ని క్రైమ్ సినిమాలు చూస్తూ ఉంటాం. ఒక హత్య చేసిన నిందితుడు పోలీసుల కన్నుకప్పి పారిపోయి తాను మరణించినట్లుగా చిత్రీకరిస్తూ ఉంటారు. దీంతో పోలీసులు కేసును కొట్టివేస్తూ ఉంటారు. తద్వారా నిందితుడు పేరు ఊరు మార్చేసి యదేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి సినిమా సీన్ క్రియేట్ చేశాడు ఒకడు. బాలేశ్ కుమార్ అనే వ్యక్తి తన బంధువైన రాజేశ్ ను డబ్బుల వ్యవహారంలో మాట మాట పెరిగి హత్య చేశాడు. రాజేష్ భార్యతో నిందితుడికి వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హత్యతో సంబంధం ఉన్న బాలేశ్ సోదరుడు సుందర్ లాల్ ను పోలీసులు 2004లో అరెస్ట్ చేశారు. రిటైర్డ్ అయి రవాణా వ్యాపారం చేసే బాలేశ్ పోలీసుల వలలో పడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఈక్రమంలోనే ఓ ట్రక్కులో పంజాబ్ నుంచి రాజస్తాన్ పారిపోయాడు. ఇలా వేళ్లే క్రమంలో తన వద్ద పనిచేసే ఇద్దరు బీహార్ కూలీలను సజీవ దహనం చేశాడు. ఈ మృతదేహాల్లో ఒకరు బాలేశ్ కుమార్ గా చిత్రీకరించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని క్లూస్ ఆధారంగా బాలేశ్ చనిపోయినట్లు నిర్థారించి కేసు మూసేశారు.

ఇలా పంజాబ్ నుంచి రాజస్తాన్ పారిపోయిన బాలేశ్ అమన్ సింగ్ గా పేరు మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించాడు. ఇలా కొంతకాలంగా జీవనం సాగిస్తూ వస్తున్నాడు. తాజాగా ఢిల్లీలో రియల్ ఎస్టేట్ డీలర్ గా పనిచేస్తున్నాడు. ఇతని వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అతన్ని విచారించగా హత్యకేసు నుంచి తప్పించుకునేందుకు రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి వేసిన వ్యూహం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు.

T.V.SRIKAR