Make A Wish Foundation : కష్టపడి చదివి పోలీస్ కావడమే ఆ చిన్నారి లక్ష్యం. బతికితే పోలీస్‌గానే బతకాలి అనే మనస్థత్వం. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిన్నారితో విధి వింత ఆట ఆడింది. చిన్న వయసులోనే రెక్టం క్యాన్సర్ అతని జీవితాన్నిచిన్నాభిన్నం చేసింది. స్కూళ్లో పిల్లలతో ఆడుకోవాల్సిన ఆ బాలుడు హాస్పిటల్‌ల మృత్యువుతో పోరాడుతున్నాడు. ట్రీట్‌మెంట్ తీసుకున్నన్ని రోజులు మాత్రమే ఆ బాలుడు బతుకుతాడు. అతనికి ఎక్కువ టైం కూడా లేదని డాక్టర్లు కూడా చేతులెత్తేశారు.
దీంతో పోలీస్ కావాలన్న అతని కల కలగానే మిగిలిపోయింది. కానీ మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఆ చిన్నారి కలను నిజం చేశారు బంజారాహిల్స్ పోలీసులు. గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మి దంపతుల కొడుకు మోహన్ సాయిది ఈ కథ. ఏడేళ్ల వయసున్న మోహన్ సాయి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నారు. కొంత కాలంగా సాయి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతని తల్లిదండ్రులు హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. బాలుడికి హెల్త్ చెకప్స్ అన్నీ చేసిన తరువాత.. ఆ బాలుడికి రెక్టం క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారించారు డాక్టర్లు. దాదాపు సంవత్సర కాలంగా హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌లో సాయికి ట్రీట్‌మెంట్ జరుగుతోంది. సాయి హెల్త్ కండీషన్ గురించి డాక్టర్లు సింపుల్‌గా చెప్పింది ఒక్కటే. అతని ఎక్కువ టైం లేదు అని.
దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు అతని ఆఖరి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు. పోలీస్ అవ్వాలి అనే చిన్నారి కోరికను బంజారాహిల్స్ పోలీసులకు వరకూ తీసుకువచ్చారు. దీంతో సాయి ఆఖరి కోరిక తీర్చాలని డిసైడయ్యారు బంజారాహిల్స్ పోలీసులు. సాయికి పోలీస్ యూనిఫాం వేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్టేషన్ సిబ్బంది అంతా సాయి గౌరవ వందనం చేశారు. చిన్నారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్‌లో కూర్చోబెట్టి అతని కోర్కెను తీర్చారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి, చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు. ఒకరోజు పోలీస్‌గా బతికిన ఆ చిన్నారి కళ్లలో ఆనందం.. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వచ్చేది కాదంటున్నారు ఆయన తల్లిదండ్రులు. తమ కొడుకు ఆఖరి కోరిక తీర్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు