ఇండియాలోని ఈ ప్రాంతంలో లుంగీలు, నైటీలు ధరించడం నిషేధం..! ఎందుకో తెలుసా..?

ప్రైవేట్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అంటేనే సవాలక్ష రూల్స్ శతకోటి కండీషన్స్ ఉంటాయి. కొందరు నీళ్లు పట్టుకునేందుకు ఇబ్బంది పెడితే.. మరికొందరు బంధువులు, స్నేహితులు పిలిపించుకునేందుకు అడ్డుపెడతారు. మరి కొంతమంది ఏసీ కనెక్షన్ల విషయంలో వాటి వాటర్ లీక్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా పెట్స్ పై అభ్యంతరం పెడుతున్న వాళ్లూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పే అంశం మరింత వింతగా, వికృతంగా ఉంటుంది. నొయిడాలోని ఒక అపార్ట్ మెంట్ ఆవరణలో నైటీలు, లుంగీలు ధరించకూడదు అని సరికొత్త రూల్స్ జారీచేశారు. ఇదే ఇక్కడ సమ్మర్ ని మించిన హాట్ టాపిక్ గా మారింది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 06:17 PM IST

గ్రెటర్ నోయిడా సెక్టార్ 2 లోని హిమ్ సాగర్ అపార్ట్ మెంట్ ఈ కొత్త ఆచారానికి తెరలేపింది. జూన్ 10న రెసిడెన్సీ వెల్షేర్ అసోసియేషన్ వాళ్లు ఈ రకమైన సర్కులర్ ను తీసుకొని వచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సర్కులర్ లో ఏముందో తెలిస్తే నివ్వెరపోతారు. ‘అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో మీ ఒంటిపై ఉన్న దుస్తులతో పాటూ మీ ప్రవర్తన పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం వల్ల మీ ప్రవర్తనను ఇతరులు తప్పుపట్టేందుకు అవకాశం ఉండదు అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంట్లో వేసుకునే లుంగీలు, నైటీలు వేసుకొని బయట తిరగొద్దు’ అనేది ఈ సర్కులర్ సారాంశం.

ఈ విషయం తీవ్రంగా దుమారం రేపడంతో అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ దీనిపై స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము ఎవరిమీద దురుద్దేశ్యంతోనో, వివక్షతోనో ఇలా చెప్పలేదు అని వివరణ ఇచ్చారు. ఈ ఫ్లాట్స్ పరిసర ప్రాంతాల్లో వదులుగా ఉండే బట్టలు ధరించి యోగా వంటి ఆసనాలు చేస్తున్నారు. అలా చేసే క్రమంలో కొందరి వస్త్రధారణ వల్ల శారీరక భాగాల విషయంలో ఇతరులకు ఇబ్బంది కలిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ముందుగా ఇలా చేసే వారికి వ్యక్తిగతంగా కలిసి చెప్పినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. అందుకే సర్కులర్ ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయంపై కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.

వస్త్రధారణ విషయంలో ఇలాంటి రూల్స్ జారీ చేయడం కొంత వరకూ వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు అవుతుంది. ఇది కేవలం చట్ట ప్రకారం చూసుకున్నట్లయితే తప్పు అవుతుంది. అదే సామాజిక కోణంలో చూసుకుంటే అలా వ్యాయామం చేయడం తప్పే అవుతుంది. ఎందుకంటే ఇతరుల శారీర భాగాలు కనిపించడం వల్ల మరొకరికి ఇబ్బంది కలుగకూడదు. ఇది స్త్రీపురుషులతో పాటూ చిన్నపిల్లల ఉండే సమాజం. కొందరు స్వేచ్ఛ కోసం చూసుకుంటే అది కాస్త ఎబ్బెట్టుగా మారుతుంది. అందుకే ఈ రూల్స్ అమలు చేయడంలో తప్పులేదు అని చెప్పవచ్చు. ఒక కోణంలో ఒకరికి న్యాయంగా.. మరొక కోణంలో ఇంకొకరికి అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి భిన్నమైన పరిస్థితులకు కాలమే సమాధానం చెప్పాలి.

 

T.V.SRIKAR