Gold Price: హాహాకారం చేయిస్తున్న బంగారం ధరలు.. ఒక్కరోజులో రూ. 1500 పెరిగిన పసిడి

బంగారం నిన్న మన్నటి వరకూ సామాన్యునికి ఆశను కలిగించింది. అయితే తాజాగా అనుకోని స్థాయిలో ధరలు పెరిగి అందరికీ షాక్ కి గురిచేసింది.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 09:32 AM IST

నేటి నుంచి దసరా ప్రారంభమైంది. విజయదశమి, దీపావళి వంటి పండుగలకు మనోళ్లు బంగారం కొనేందుకు క్యూ కడతారు. పైగా ధనత్రయోదశి అనే సెంటిమెంట్ అందరిలో బంగా నాటుకుపోయింది. ఈక్రమంలో గత వారం పదిరోజుల వరకూ తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మన దేశంలో రోజు ద్రవ్యోల్భణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం పై పెట్టుబడులు పెడితే ఎప్పటికైనా స్థిరమైన లాభసాటి ఆదాయం వస్తుందనే ఉద్దేశ్యంతో ఇందులో పెట్టుబడులు పెడతారు. అంతేకాకుండా నేటి నుంచి దసరా పండుగ ప్రారంభమౌతోంది. ఇక పెళ్లి ముహూర్తాలైతే చెప్పనక్కర్లేదు. దీనికి తోడూ ఇజ్రాయెల్ – హమాస్ ల యుద్దం. దీంతో అన్ని పరిస్థితులు మూకుమ్మడిగా రావడంతో బంగారం విలువ అమాంతం పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు కొనుగోలు చేస్తాడో లేదో అన్న భయంతో స్వర్ణాభరణాల విక్రయదారులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తరుగుపై ప్రత్యేక రాయితీ.. ఇన్ని గ్రాముల వరకూ డిస్కౌంట్.. ఇంత ధరకు కొంటే ఇంత శాతం డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు.

బంగారం ధరలు ఇలా..

మన్నటి వరకూ 24 క్యారెట్ పసిడి 10 గ్రాముల ధర 58 నుంచి 59 వేల మధ్య స్థిరంగా ఉండేది. అయితే దసరా ప్రారంభంలోనే దాదాపు రూ. 1500 పెరిగి రూ. 60వేలకు చేరింది. అదే 22 క్యారెట్ల విషయానికొస్తే మన్నటి వరకూ 10 గ్రాములు రూ. 53 నుంచి 54 వేల వద్ద కొనాగుతూ ఉండేది. తాజాగా 55 పైకి ఎగబాకింది.

భవిష్యత్ ఎలా..

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ద ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను ఔన్సుల్లో లెక్కగడతారు. ఈ వారంలో ఔన్స్ బంగారం విలువ ఐదు శాతం పెరిగింది. అందుకే మన్నటి వరకూ 1,850 డాలర్ల వద్ద కొనసాగిన బంగారం ఒక్కసారిగా 1,950 డాలర్ల వద్ద దోబూచులాడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచదేశాల పరిస్థితుల దృష్ట్యా 2,000 డాలర్లు పైకి చేరే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. తాజాగా ఉన్న 1,968 నుంచి 2,000 కు అధిగమిస్తే మన దేశంలో 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ. 62 వేలకు చేరే అవకాశం ఉంటుంది. దీనిక తోడూ మన దేశీయంగా ఉన్న పండుగలు, పెళ్లిళ్లను పరిగిణలోకి తీసుకుంటే మరింత పైకి పసిడి ధరలు ఎగబాకే అవకాశం ఉందంటుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

T.V.SRIKAR