Rice Price: నిన్న టమాట.. ఇవాళ బియ్యం.. భగ్గుమంటున్న ధరలు.. జనం బతికేదెలా!?

టమాట ధరలు పెరిగితే సర్డుకున్నాము.. మిర్చి రేట్ పెరిగితే ఎండు కారంతో నెట్టుకొస్తున్నాము. మరి బియ్యం ధరే పెరిగితే.. ఏం తినాలి ఎలా తినాలి.. ఎలా బతకాలి.. జనం ఆవేదన ఇది.

  • Written By:
  • Updated On - July 16, 2023 / 02:01 PM IST

నిత్యావసర సరకుల ధరలు నింగిని తాకుతున్నాయి. బియ్యం దగ్గర నుంచి కూరగాయల వరకూ అన్నింటి రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇక పప్పుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బియ్యం ధరలు మండుతున్నాయి. మార్కెట్ లో కేజీ బియ్యం 50 రూపాయల నుంచి 60 రూపాయలు పలుకుతున్నాయి. ప్రభుత్వం కిలో రెండు రూపాయలకు బియ్యం ఇస్తున్నా వాటిని ఎవరూ తినడం లేదు. ప్రతి ఒక్కరు సన్న బియ్యాన్నే వాడుతున్నారు. ఈ అలవాటు తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగునున్న తమిళనాడు, కేరళ, ఒడిశాలకు పాకింది. దాంతో బియ్యం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఇక్కడ ఒక పంట పోవడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కావడంతో బియ్యం రేట్లు పెంచేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. మూడు, నాలుగు నెలల క్రితం 26 కిలోల బస్తా ధర 12 వందల రూపాయలు ఉండేది. ఇప్పుడు 15 వందలకు చేరింది. ఇక అటు కూరల్లో వేసుకునే పచ్చిమిర్చి రెండు నెలల క్రితం కిలో 28 రూపాయలు ఉండేది. ఇప్పుడు అదే మిర్చి కిలో 120కి రైతుబజార్లలోనే అమ్ముతున్నారు. బయట అయితే 200కుపైగా పలుకుతోంది. ఇక టమాటా సంగతి చెప్పక్కర్లేదు. రైతుబజార్లలో కిలో 100 చొప్పున అమ్ముతున్నారు. బయట 140 రూపాయలు. ధరలు ఇలా పెరిగితే బతికేది ఎలా అని.. సామాన్యులు దిగులుతో మిగిలి పోతున్నారు.