గత నెల 25 వరకూ వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి ఒకటి నుంచి నలుగురు అభ్యర్థులు ఉండేలా ఈ జాబితాను రూపొందించింది. దీనికి కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు ఆదివారం గాంధీభవన్ లో సమావేశం ఏర్పాటు చేసి హాజరయ్యారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ 1006 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి రాజకీయ, కుటుంబ, ఆర్థిక, సామాజిక నేపథ్యాలతో పాటూ పార్టీలో వీరు చురుగ్గా పాల్గొంటున్నారా లేదా అన్న అంశం ఆధారంగా కొందరిని సెలెక్ట్ చేసి పుస్తకాన్ని తయారు చేస్తారు. దీనిని పీఈసీ సభ్యులకు అందజేశారు. ఈ జాబితాను వడపోసి ప్రాథమిక జాబితాను తయారు చేశారు. దీనిని సీల్డ్ కవర్ లో ఉంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నారు.
స్క్రీనింగ్ కమిటీ పాత్రే కీలకం..
ఈ జాబితాపై స్క్రీనింగ్ కమిటీ మూడు రోజుల పాటూ పరిశీలించనుంది. ఈ కమిటీకి ఛైర్మన్ మురళీధరన్ కాగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిగ్నేష్, బాబాసిద్దికి సభ్యులుగా ఉంటారు. ఈ సభ్యులందరితో వ్యక్తిగతంగా సమావేశాన్ని స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆతరువాత ఇంకా ఎవరైనా బలమైన అభ్యర్థులు ఉన్నారా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. ఆతరువాత తుది జాబితాను కేవలం స్క్రీనింగ్ కమిటీ మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకొని ఫైనల్ జాబితాను రూపొందిస్తుంది.
దాదాపు ఖరారైన అభ్యర్థులు..
ఇలా రూపొందించిన జాబితా నుంచి మూడు పేర్లను ఎంపిక చేసి ఢిల్లీకి పంపుతుంది. అక్కడి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు పంపుతుంది. ఇందులో నియోజకవర్గానికి ఒక్క అభ్యర్థి మాత్రమే ఉంటే వారిని అధిష్టానం ఈ నెల 15 నాటికి తొలిజాబితాగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లు ఉంటే ఈ నెల చివరి నాటికి మరి కొందరి పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరికి మాత్రం సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. వారిలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, జగిత్యాల జీవన్ రెడ్డి, హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క, మంథనికి శ్రీధర్ బాబు, అలంపూర్ సంపత్ కుమార్, కామా రెడ్డి షబ్బీర్ అలీ, ములుగు సీతక్క పేర్లు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారికంగా వెలువడాల్సి ఉంది.
బీసీలకు పెద్దపీట
ఈ సారి బీసీలకు అధిక ప్రాథాన్యం ఇస్తామని రేవంత రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ఈ సారి రెడ్డి సామాజిక వర్గానికి అధికంగా అవకాశాలు కల్పించింది. అయితే కాంగ్రెస్ దీనిని వ్యూహంగా మలుచుకొని బీసీ ఓట్లను తనవైపుకు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏది ఏమైనా తొలి జాబితాలోని పేర్లను తెలుసుకోవాలంటే ఈనెల 15 వరకూ వేచి చూడక తప్పదు.
T.V.SRIKAR