లోక్ సభ, అసెంబ్లీ, GHMC … ఇలా ఏ ఎన్నికలైనా హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం బాగా తగ్గుతుంది. 50శాతానికి అటు ఇటుగా నమోదవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటెయ్యాలని ఉన్న ఉత్సాహం సిటీ జనానికి ఎందుకు లేదు. ఓట్లు వేయడం మన హక్కు… మీ ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోండి… ఇలాంటి ప్రచారాలను EC యే కాదు… సెలబ్రెటీలు కూడా చేస్తున్నారు. అయినా ఎందుకు ఓటింగ్ తగ్గుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ …హైదరాబాద్ లో లోక్ సభ స్థానాలపై చూపించినట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల నుంచి చాలా మంది హైదరాబాద్ జనం ఏపీకి క్యూ కట్టారు. రైళ్ళు, బస్సులతో పాటు సొంత కార్లల్లో కూడా వెళ్ళారు. గతంలో కంటే ఈసారి తమ సొంతూళ్ళకి వెళ్ళి ఓటు వేయాలి అనే పట్టుదల ఓటర్లలో ఎక్కువగా కనిపించింది.
ఆంధ్ర జనమంతా వెళ్ళిపోయిదంతో రెండు రోజులుగా హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కూడా తగ్గింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 40 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నట్టు అంచనా ఉంది. దాంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పై ఆ ఎఫెక్ట్ పడింది. చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడంతో చాలామంది అక్కడా, ఇక్కడా ఓట్లు వేశారు. రెండు ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలతో ఈసీ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తోంది. కానీ ఆంధ్రలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండటం… తెలంగాణలో లోక్ సభ ఎలక్షన్సే కావడంతో.. చాలామంది ఏపీలో ఓటెయ్యడానికే ఇష్టపడ్డారు. పైగా అక్కడ జగన్ కీ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండటం కూడా ఒక కారణం.
ఏపీ, తెలంగాణలో డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయన్న దానిపై క్లారిటీ లేదు. ఓటర్ల లిస్టులో ఒక్కచోటే పేరు ఉండాలని తెలిసినా డబుల్ ఉన్నవాళ్ళ రద్దు చేసుకోవడం లేదు. ఓటర్ కార్డుతో… ఆధార్ లింకేజ్ ని పూర్తి స్థాయిలో చేస్తే తప్ప దీనికి పరిష్కారం దొరికే అవకాశం లేదంటున్నారు. కొంత వరకూ ఆధార్ లింకేజ్ అయినా… ఇంకా చాలా మంది చేసుకోలేదు. రెండు చోట్లా ఓట్లు ఉండటం క్రిమినల్ నేరం అని ఈసీ చెబుతున్నా… ఒకచోట రద్దు చేయడంపై ఖచ్చితమైన చర్యలు మాత్రం తీసుకోవట్లేదు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఇంట్లో ఉండిపోయే వారిని చైతన్యం చేయడానికి సెలబ్రిటీలు ప్రయత్నించారు. ఇక పాతబస్తీలో అయితే… MIM పార్టీ కార్యకర్తలు… ఇంటింటికీ తిరిగి తలుపులు తడుతూ… ఓట్లేయమని అడగడం కనిపించింది. హైదరాబాద్ లో MIM కి ఈసారి బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చింది. అందువల్లే ఎన్నడూ లేనవిధంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు MIM ప్రయత్నించింది.