Telangana Governor: తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్.. తెరపైకి సర్కారియా కమిషన్‌ సిఫారసులు.. ఏమిటవి ?

గవర్నర్ కోటాలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పదవుల కోసం ఇద్దరి పేర్లను సూచిస్తూ తెలంగాణ మంత్రివర్గం చేసిన సిఫార్సుకు గవర్నర్ తమిళిసై నో చెప్పడం రాజకీయ కలకలం క్రియేట్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 01:45 PM IST

గవర్నర్ కోటాలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పదవుల కోసం ఇద్దరి పేర్లను సూచిస్తూ తెలంగాణ మంత్రివర్గం చేసిన సిఫార్సుకు గవర్నర్ తమిళిసై నో చెప్పడం రాజకీయ కలకలం క్రియేట్ చేసింది. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టుకు అనర్హులని గవర్నర్ కార్యాలయం ప్రకటించడం సెన్సేషనల్ గా మారింది. రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పోస్టులకు సిఫార్సు చేయాలని తమిళిసై తేల్చి చెప్పడంతో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్యనున్న గ్యాప్ ఇంకా అలాగే ఉందనే విషయం క్లియర్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సర్కారియా కమిషన్‌ సిఫారసులకు విరుద్ధంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై నియామకం జరిగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. ఇంతకీ సర్కారియా కమిషన్ ఏమిటి ? అదేం చెప్పింది ? ఇప్పుడు తెలుసుకుందాం..

సర్కారియా కమిషన్ ఏం చెప్పింది ?

గవర్నర్.. రాష్ట్ర సర్కారుకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధి. రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే హక్కు కేంద్ర సర్కారుకు ఉంది. గవర్నర్లను నియమించే క్రమంలో అనుసరించాల్సిన నియమావళిపై సర్కారియా కమిషన్‌ పలు సిఫారసులు చేసింది. క్రియాశీల రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనని వ్యక్తులనే గవర్నర్‌ పదవికి ఎంపిక చేయాలని చెప్పింది. గవర్నర్‌ను నియమించే ప్రక్రియలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ను సంప్రదించే సంప్రదాయం ఉండాలని తెలిపింది. గవర్నర్‌ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండాలని సర్కారియా కమిషన్ పేర్కొంది. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి తప్పనిసరిగా నియామక రాష్ట్రానికి వెలుపలి వ్యక్తి అయి ఉండాలని చెప్పింది. గవర్నర్‌ స్థానంలో ఉన్నవారు.. ఆ పదవిని విడిచిపెట్టిన తర్వాత ప్రభుత్వం కింద ఏ ఇతర నియామకం లేదా లాభదాయక పదవులకు అర్హులు కారు అని సర్కారియా కమిషన్ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రాంతీయ రాజకీయాల్లో గవర్నర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా నిర్దేశించింది.

కేసీఆర్ పార్టీ నేతల ఆరోపణలతో కలకలం..

రాష్ట్రాల వ్యవహారాల్లో గవర్నర్లు తమదైన శైలిలో స్వతంత్ర్యంగా వ్యవహరించేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసుల అంశం తెరపైకి రావడం సర్వసాధారణ అంశంగా మారింది. సర్కారియా కమిషన్ సిఫారసులను పకడ్బందీగా అమలు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చాలాసార్లు నొక్కి చెప్పింది. దేశంలో కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యానికి ఉద్దేశించిన సమాఖ్య వ్యవస్థకు భంగం కలగకుండా గవర్నర్ల పనితీరు ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి రాజకీయ నేపథ్యం ఉందని.. ఇది సర్కారియా కమిషన్ సిఫార్సులకు విరుద్ధమని సీఎం కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే తమిళిసై క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారని.. 2005 నుంచి 2010 వరకు బీజేపీ ఆల్‌ ఇండియా మెడికల్‌ వింగ్‌ దక్షిణాది రాష్ట్రాల కో కన్వీనర్‌గా పనిచేశారని గులాబీ నేతలు అంటున్నారు. 2010 నుంచి 2013 వరకు బీజేపీ తమిళనాడు స్టేట్‌ జనరల్‌ సెక్రటరీగా.. 2013 నుంచి 2014 వరకు బీజేపీ తమిళనాడు వైస్‌ ప్రెసిడెంట్‌గా.. 2014 ఆగస్టు 16 నుంచి 2019 సెప్టెంబర్‌ 1వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై పనిచేశారని వారు వాదిస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌గా నియమించబోతున్నారన్న సమాచారం అందిన తర్వాతే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి తమిళిసై రాజీనామా చేశారని కేసీఆర్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వారం తర్వాత.. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారని అంటున్నారు.