Puri Jagannath : వీడనున్న జగన్నాథ రహస్యం! 40 ఏళ్ల తరువాత తెరుచుకోనున్న రత్నభండార్‌

సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలకు నెలవు కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం. విలువైన ఆభరణ సంపద ఈ గుడి కింద ఉందని చాలా మంది నమ్ముతారు.

 

 

సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలకు నెలవు కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం. విలువైన ఆభరణ సంపద ఈ గుడి కింద ఉందని చాలా మంది నమ్ముతారు. ఇదే మాదిరిగా మన దేశంలో మరో ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది. అదే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకలు ఇదే గుడిలో ఉన్నాయి. ఈ ఆలయం కింద ఉన్న ఆభరణాల నిల్వ గది.. రత్న భండార్‌ను 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు.

ఇందులో నిధికి కాపలాగా విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యవసర ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు. పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్‌ సర్కార్‌ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్‌ మళ్లీ ఊపందుకుంది. 1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి.

12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది. పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్‌ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ నిధి అలాగే ఉంది. 40 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ గదిని తెరవబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు.