శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిన లింగం.. చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయ రహస్యం

శిబిచక్రవర్తి.. దానశీలుడు. దాతృత్వానికి మరో పేరు. చేతికి ఎముకే లేదన్నట్టు దానం చేసేవాడు. ధర్మనిరతిలోనూ, దానగుణంలోనూ ఆయన్ను మించిన వారు లేరు. అలాంటి గొప్పవ్యక్తి, మహానుభావుడైన శిబి చక్రవర్తి.. లింగరూపంగా మారి... కపోతేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - November 28, 2024 / 03:12 PM IST

శిబిచక్రవర్తి.. దానశీలుడు. దాతృత్వానికి మరో పేరు. చేతికి ఎముకే లేదన్నట్టు దానం చేసేవాడు. ధర్మనిరతిలోనూ, దానగుణంలోనూ ఆయన్ను మించిన వారు లేరు. అలాంటి గొప్పవ్యక్తి, మహానుభావుడైన శిబి చక్రవర్తి.. లింగరూపంగా మారి… కపోతేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. అసలు శిబిచక్రవర్తి.. లింగరూరంలోకి ఎందుకు మారాడు..? ఎలా మారాడు…? శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిన లింగం.. ఏ ఆలయంలో ఉంది..? ఏ ఆలయం ఎక్కడ ఉంది..? ఆలయం వెనకున్న పురాణ కథ ఏంటి..?

దక్షిణ భారతదేశలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాల్లో చేజర్ల కపోతేశ్వరాలయం ఒకటి. పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం చేజర్లలో ఉంది ఈ ఆలయం. నరసరావుపేటకు సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ప్రాచీన దేవాలయం. ఆ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అని అంటారు. మహారాష్ట్రలోని తేర్-ఆంధ్రప్రదేశ్‌లోని చేజర్ల… రెండు చోట్ల ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు ఆ తర్వాత హైందవ శివాలయాలుగా మార్చబడ్డాయి. అప్పటి నుంచి చేజెర్లలోని శివాలయాన్ని కపోతేశ్వరాలయంగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం నాలుగు లేదా ఐదవ శతాబ్దంలో ఆ ఆలయాన్ని నిర్మించారు.

స్థల పురాణం

స్థలపురాణ ప్రకారం… ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించింది. శిబికి, కపోతానికి అంటే పావురానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాధ, ఒక బౌద్ధ గాధ ఉన్నాయి. మహాభారతం ప్రకారం… మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 15 వందల మంది పరివారాన్ని వెంటబెట్టుకుని కాష్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయల్దేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలిసి తపో దీక్షను ఆచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా… ఆ భస్మం ఒక లింగరూపం ధరించిందట. మేఘాలమల్లేశునిగా కొలువబడుతున్న లింగం అదే. అన్న తిరిగి రానందున జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకుని వెతుకుతూ ఆ కొండ దగ్గరకు వెళ్లాడు. అన్నకు ఏం జరిగిందో తెలుసుకుని… ఆ కొండపైనే తమాచరించి.. మరణించాడు. అతను కూడా లింగరూపం ధరించాడు. తమ్ముళ్లను వెతుకుతూ వెళ్లిన శిబి చక్రవర్తి కూడా ఆ కొండపైకి చేరుకుని రెండు లింగాలను చూశాడు. అక్కడ వంద యజ్ఞాలు చేయాలని సంకల్పించాడు. 100వ యజ్ఞం చేస్తుండగా… దేవతలు అతన్ని పరీక్షించాలని అనుకున్నారు. శివుడు ఒక వేటగాని రూపంలో.. బ్రహ్మ శివుని బాణం రూపంలో… విష్ణువు పాపురం రూపంలో యాగం దగ్గరకి వచ్చారు. వేటగాడి రూపంలో ఉన్న శివుడు తరమడిన పాపురం(విష్ణువు).. శిబిచక్రవర్తిని శరణు జొచ్చింది. వెంటనే శిబి చక్రవర్తి ఆ పక్షికి అభయమిచ్చాడు. ఆ తర్వాత వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వాలని… లేదంటే.. తనతోపాటు తన కుటుంబం అంతా ఆకలితో అమటిస్తారని చెప్తాడు. దీంతో… శిబి చక్రవర్తికి ఏం చేయాలో పాలుపోదు. ఆఖరికి పాపురానికి సమానమైన మాంసం ఇస్తానని వేటగాడికి హామీ ఇస్తాడు. ఈ ప్రకారం… తూకం తెప్పింది.. ఒక త్రాసులో పాపురాన్ని ఉంచి… రెండో త్రాసులో… తన శరీరంలోని కొంత మాంసాన్ని కోసి ఉంచుతాడు. అయినా… త్రాసులు సరితూగవు. దీంతో.. తన తల నరికి త్రాసులో పెడతాడు శిబి చక్రవర్తి. అతని త్యాగశీలతకు మెచ్చి త్రిమూర్తులు అన్ని పునరుజ్జీవితుడిని చేసి… ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు.. శిబి చక్రవర్తి తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తి కావాలని కోరుకుంటాడు. పరివార సమేతంగా తమ శరీలుగా లింగాలుగా కావాలని కోరుకుంటాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగం అయ్యిందని స్థల పురాణం చెప్తోంది.

చేజర్ల సమీపంలోని పవిత్రమైన ప్రదేశాలు…

శిబిచక్రవర్తి వంద యజ్ఞాలు చేసి.. త్రిమూర్తులను మెప్పించి.. తనతోపాటు తన అనుయాయులకు కూడా లింగరూపాల్ని ప్రాప్తింపచేసి.. కైలాసప్రాప్తిని పొందన పుణ్యప్రదేశమే చేజర్ల. చేజర్ల శ్రీకపోతేశ్వరాలయంలో లింగమూర్తి శిలాలింగము కాదని, శల్య లింగమని ప్రతీతి. అంతేకాదు… శిబి చక్రవర్తి తపశక్తిని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశం విప్పర్ల గ్రామంగా పిలవబడుతోంది. త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం.. రూపెనగుంట్లగా పిలవబడుతోంది. ఈ గ్రామాలు చేజర్లకు దగ్గరలోనే ఉన్నాయి.

చేజర్ల కపోతేశ్వరాలయం వెనకున్న బౌద్ధ కథ

శిబి జాతక కథ ప్రకారం… శిబిచక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. కన్నులను ఇంద్రుడికి దానం చేసిన ప్రదేశం కుంట కానుక… ఆ ప్రదేశం కండ్లకుంటగా పిలవబడుతోంది. అవసన సతకం కథ.. శిబిజాతక కథనూ, మహాభారత కథనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కథ తరచూ కనిపిస్తుంది. అమరావతి, నాగార్జునకొండలో శిబి జాతక కథకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి.

కపోతేశ్వరస్వామి ఆలయ విశిష్టత…

పల్నాడు జిల్లా చేజర్ల గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతేశ్వరస్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. కపోతేశ్వర లింగం స్వయంభువుగా చతురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది. ఈ లింగం గుండ్రంగా కాకుండా కరచరణములు. శిరస్సు లేని మనిషి మొండెంలా పలకగా ఉంటుంది. ఈ లింగాకృతి చుట్టూ మాంసము తీసి ఇచ్చినట్టు గుంటలు ఉంటాయి. శిబిచక్రవర్తి తన భుజాలను నరికి ఇచ్చినట్టుగా లింగానికి కుడి, ఎడమ వైపులా రెండు బిలాలు ఉంటాయి. ఈ బిలాలు అభిషేక తీర్థాన్ని గ్రహిస్తాయి. ఈ తీర్థం ఎక్కడ ప్రవహిస్తుందో ఎవరికీ తెలియదు. కుడిబిలంలో ఒక బిందె నీరు మాత్రమే పడుతుంది. ఎడమబిలంలో ఎన్ని నీళ్లు పోసినా నిండదట. ఎడమ బిలాన్ని నీటితో నింపే ప్రయత్నం చేస్తే… కాసేపటికే పొగ, మంటలు వచ్చాయని చెప్తారు. అప్పుడు అపరాథ శాతం చేశారట. అంతేకాదు… కుడిబిలంలో పోసిన నీరు మరుసటి రోజుకు పచ్చి మాంసపు వాసన వస్తుందని చెప్తున్నారు. ఆ నీటిని రోజూ కుంచెకోలతో తీస్తారట. అందుకే దీన్ని శల్యలింగంగా పిలుస్తారు. లింగానికి సహజ యజ్ఞోపవీతం కనిపిస్తుంది.

కపోతేశ్వరస్వామి ఆలమంలో తొలి గణపతి శిల్పం…

చేజర్ల కపోతేశ్వరస్వామి ఆలయంలో తెలుగువారి తొలి గణపతి శిల్పం ఉంది. ఈ శిల్పం పల్నాటి సున్నపురాతిలో చెక్కింది. ఈ గణపతి విగ్రహం రెండు చేతులు కలిగి.. వాటిలో మోదకం, దంతాలను ధరించి ఉంటుంది. అంతేకాదు కిరీటం లేని సహజమైన ఏనుగు ముఖంతో.. లిలితాసంలో కూర్చుని ఉంటుంది.