ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ముందస్తు అంటూ హడావుడి జరుగుతున్నా.. అది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ముందస్తు ఉన్నా లేకపోయినా.. ముందుగానే జనాల్లో ఉండాలని పార్టీలన్నీ డిసైడ్ అయ్యాయ్. యువగళం అంటూ లోకేశ్ పాదయాత్ర చేసినా.. వారాహి యాత్ర అంటూ పవన్ కల్యాణ్ వాహనం ఎక్కినా.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు రాష్ట్రం చుట్టేస్తున్నా.. వైసీపీ ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తున్నా.. జగనన్నకు చెబుదాం అంటున్నా.. రీజన్ అదే ! ఇదంతా ఎలా ఉన్నా.. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం అని అనుకున్నారు నిన్నటి వరకు ! వారాహి యాత్ర తర్వాత పూర్తిగా మారిపోయింది సీన్. గెలిపించండి సీఎం అవుతా అని పవన్ పదేపదే చెప్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీని ఒక్క సీటు గెలవనివ్వనని సవాల్ విసురుతున్నారు. సీట్ల విషయంలో టీడీపీని గ్రిప్‌లో పెట్టుకోవడానికి ఇలా చేస్తున్నారా.. లేదంటే సింగిల్‌గానే పోటీకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీల సంగతి ఇలా ఉంటే.. వీళ్లతో బీజేపీ కలుస్తుందా లేదా అన్నది మరో ప్రశ్న. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో కొత్త డిస్కషన్ మొదలైంది. ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు. సింగిల్‌గా బరిలోకి దిగుదామని చంద్రబాబు మీద టీడీపీ నేతలంతా ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.
జగన్‌కు, వైసీపీకి వ్యతిరేకంగా వేవ్ మొదలైందని.. ప్రతీ ఎమ్మెల్యే మీద జనాల్లో వ్యతిరేకత ఉందని.. జనాలు మార్పు కోరుకుంటున్నారని.. ఇలాంటి సమయంలో సింగిల్‌గా పోటీ చేయడమే బెటర్ అని.. లేదంటే సీట్ల విషయంలో అనసవర త్యాగాలు తప్పవు అంటూ.. చంద్రబాబు ముందు పదేపదే ప్రస్తావనకు తీసుకువస్తున్నారని సమాచారం. బీజేపీతో ఒరిగేదేమీ లేదు.. పవన్ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు.. సింగిల్‌గానే వెళ్దాం అంటూ.. చంద్రబాబుతో మొత్తుకుంటున్నారట తెలుగుదేశం పార్టీ నేతలు.
దీంతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడిపోయినట్లు తలుస్తోంది. వైసీపీ మీద వ్యతిరేకత ఉన్న మాట నిజమే అయినా.. అది అధికారాన్ని మార్చేసేంత ఉందా అంటే.. ఏపీ రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు అనే సమాధానమే వినిపిస్తోంది. పవన్ తీరు ఓవైపు.. టీడీపీ నేతల ఒత్తిడి మరోవైపు.. ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీల కంటే టీడీపీకే వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం. మళ్లీ ఓడిపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న టెన్షన్ పార్టీ శ్రేణుల్లోనే కాదు.. జనాల్లోనూ కనిపిస్తోంది.