కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనతో కేరళ రాష్ట్రం (Kerala State) విలవిలలాడిపోతోంది. రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికి భరోసానివ్వడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వయనాడ్‌లో పర్యటించారు. నిజానికి ప్రమాదం జరిగిన మరుసటి రోజే రాహుల్ గాంధీ వయనాడ్ (Wayanad) కు రావాల్సి ఉంది. కానీ ప్రమాదం జరిగిన మరుసటి రోజు కూడా అక్కడ వర్షం కురుస్తూనే ఉంది.
దీంతో అక్కడి వాతావరణ (weather) పరిస్థితుల దృష్ట్యా అధికారులు రాహుల్‌ను అనుమతించలేదు. దీంతో పరిస్థితి కాస్త సెట్ అవ్వగానే వయనాడ్‌లో పర్యటించారు రాహుల్. ఆయనతో పాటే ప్రియాంక గాంధీ కూడా వయనాడ్‌కు వచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించారు. ఉదయం 9.30కు కన్నూర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గంలో వయనాడ్‌కు వెళ్లారు. మధ్యాహ్నానికి చూరల్‌మల చేరుకున్నారు. వీరి వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అలప్పుజా ఎంపీ కేసీ వేణుగోపాల్ (MP KC Venugopal) కూడా ఉన్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశంతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజ్, మెప్పాడిలోని రెండు సహాయ శిబిరాలనూ సందర్శించారు. వయనాడ్‌లో ప్రతీ ఒక్కరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
చూరల్‌మలలో ఒక్కచోటే 250 మందికి పైగా చనిపోగా.. 200 మంది గాయపడ్డారు. జులై 30 తెల్లవారుజామున వయనాడ్‌లోని ముండక్కై, చురల్‌మలలో భారీ వర్షాలకు (Heavy rains) కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతదేహాలపై పడ్డ బండరాళ్లను అడ్డుతొలగించడానికి యంత్రాలసాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో (2019 General Election) వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి మళ్లీ గెలుపొందారు. అయితే ఆయన గత ఎన్నికల్లో యూపీలోని రాయబరేలి నుంచీ పోటీ చేశారు. రెండింట్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో రాహుల్.. వయనాడ్ సీటుకి రాజీనామా చేశారు. ఈ ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు.