సన్ రైజర్స్ లోకి షమీ, రూ.10 కోట్లు పెట్టిన కావ్యా పాప

ఐపీఎల్ 2024 సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలంలో పక్కా వ్యూహంతో బరిలోకి దిగినట్టు కనిపిస్తోంది. తమ పర్స్ లో ఉన్న 45 కోట్లతో చాలా తెలివిగా ప్లేయర్స్ ను తీసుకుంటోంది.

  • Written By:
  • Updated On - November 24, 2024 / 09:32 PM IST

ఐపీఎల్ 2024 సీజన్ లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మెగా వేలంలో పక్కా వ్యూహంతో బరిలోకి దిగినట్టు కనిపిస్తోంది. తమ పర్స్ లో ఉన్న 45 కోట్లతో చాలా తెలివిగా ప్లేయర్స్ ను తీసుకుంటోంది. స్టార్ ప్లేయర్స్ కోసం మధ్యలో ఆశ్చర్యకరంగా పోటీ పడి చివర్లో తప్పుకున్న సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన పేస్ బౌలింగ్ కు మరింత పదును పెట్టింది. చాలా తెలివిగా పేస్ గుర్రం మహ్మద్ షమీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను 18 కోట్లతో రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. ఆదివారం ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతనికి జోడీగా భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని కొనుగోలు చేసింది. 2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన మహ్మద్ షమీ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ బిడ్ వేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ పోటీకి వచ్చింది. దాంతో ఈ రెండు ఫ్రాంఛైజీలు షమీ కోసం 8.25 కోట్ల వరకూ పోటీపడగా.. ఈ దశలో లక్నో సూపర్ జెయింట్స్ రేసులోకి వచ్చింది.

ఈ మూడు ఫ్రాంఛైజీలు 9.75 వరకూ పోటీపడగా.. ఆఖర్లో అనూహ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 కోట్లకి బిడ్ వేసింది. అయితే.. ఏ ఫ్రాంఛైజీ ఆపై బిడ్ వేయకపోవడంతో.. షమీ ఎవరూ ఊహించని రీతిలో 10 కోట్లకే సన్‌రైజర్స్ సొంతమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం షమీని గుజరాత్ టైటాన్స్ 6.25 కోట్లని సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా వరుస గాయాలతో సతమతమవుతున్న షమీ ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు 110 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన మహ్మద్ షమీ.. 127 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ సమర్థంగా బౌలింగ్ చేయగల సత్తా ఈ సీనియర్ పేస్ సొంతం. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో షమీకి మంచి రికార్డే ఉంది. గత సీజన్ లో ఆడని షమీ 2021 నుంచి 2023 వరకూ ప్రతీ సీజన్ లో మాత్రం అద్భుతం రాణించాడు.

2021 సీజన్ లో 19 వికెట్లు, 2022లో 20 వికెట్లు, 2023లో 28 వికెట్లతో అదరగొట్టాడు. మెగావేలంలో షమీకి మంచి ధరే వస్తుందని అందరూ ఊహించారు. కమిన్స్, షమీ జోడితో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ దళం పదునెక్కిందని ఇప్పుడు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఫిట్ నెస్ సమస్యలతో సతమతమయ్యే షమీ ఒక్కోసారి సీజన్ ఆరంభానికి ముందు తప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ తర్వాత దాదాపు ఏడాది పాటు భారత జట్టుకు దూరమైన షమీ ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు.