ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత టీ ట్వంటీ జట్టులో ప్రతీ ప్లేస్ కోసం పోటీ ఓ రేంజ్ లో ఉంటోంది… యువక్రికెటర్లు ఎప్పటికప్పుడు దుమ్మురేపుతూ సీనియర్లకు సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో సీనియర్లు ఫామ్ కోల్పోతే జట్టులో వారి ప్లేస్ కూడా డేంజర్ పడిపోయినట్టే… ప్రస్తుతం టీమిండియా ముగ్గురు సీనియర్ల టీ ట్వంటీ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో వారి అంతర్జాతీయ టీ ట్వంటీ భవిష్యత్తు ముగిసినట్టేనని అంచనా వేస్తున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రేయాస్ అయ్యర్ గురించే… ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన అయ్యర్ గత కొంతకాలంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ప్రస్తుత అంచనా ప్రకారం వన్డే, టెస్ట్ క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటకీ… టీ ట్వంటీ జట్టులోకి మాత్రం శ్రేయాస్ కెరీర్ ముగిసినట్టేనని భావిస్తున్నారు.
2017లోనే టీ ట్వంటీ అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ కెరీర్ మరీ అంత గొప్పగా ఏం లేదు. టీమిండియా తరపున 51 టీ ట్వంటీలు ఆడిన అయ్యర్ స్ట్రైక్ రేట్ 140 లోపే ఉంది. తనకు వచ్చిన అవకాశాల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడలేకపోయినప్పటకీ పర్వాలేదనిపించాడు. డిసెంబర్ 2023లో ఆస్ట్రేలియాతో తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ జట్టులో చోటు దక్కలేదు. మరో ప్లేయర్ శార్థూల్ ఠాకూర్ కూడా టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. శార్థూల్ అంతర్జాతీయ టీ ట్వంటీ ఆడి రెండున్నరేళ్ళు దాటిపోయింది. చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో విండీస్ పై శార్థూల్ ఠాకూర్ టీ ట్వంటీ ఆడాడు. ఇప్పటి వరకూ 25 టీ ట్వంటీలు మాత్రమే ఆడిన శార్థూల్ 33 వికెట్లు తీశాడు. 32 ఏళ్ళ శార్థూల్ ఠాకూర్ కు టీ ట్వంటీ రీఎంట్రీపై ఆశలు లేవనే చెప్పాలి.
ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ సైతం టీ ట్వంటీ జట్టులోకి ఎంపిక కావడం లేదు. రాహుల్ టెస్ట్, వన్డే ఫార్మాట్ లపై ఎక్కువగా ఫోకస్ పెట్టినా పొట్టి క్రికెట్ లో మంచి రికార్డే ఉంది. అయినప్పటకీ ప్రస్తుతం యువ ఆటగాళ్ళ నుంచి పోటీ ఎక్కువైన నేపథ్యంలో రాహుల్ అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ ఆడి రెండేళ్ళు దాటిపోయింది. చివరిసారిగా 2022లో టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన రాహుల్ ఇప్పటి వరకూ 72 మ్యాచ్‌లలో 2265 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కాగా కోచ్ గంభీర్ యువ క్రికెటర్లతోనే 2026 టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీమ్ ను రెడీ చేస్తుండడంతో వీరి కెరీర్ ముగిసినట్టే.