Bonalu Begins: లష్కర్‌ బోనాలకు సిద్ధమౌతున్న జంట నగరాలు

తెలంగాణలో అత్యంత చారిత్రక ప్రిసిద్ధిగాంచిన ఉత్సవం లష్కర్‌ బోనాల జాతర. ప్రతీ యేటా ఆషాడమాసంలో ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది.

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 02:46 PM IST

చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతీ యేటా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా తెలంగాణ ప్రభుత్వం బోనాల నిర్వణకు 15 కోట్లు కేటాయించింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ నిర్వహణ బాధ్యత తీసుకోనున్నారు. ఇప్పటికే నగరంలో పనులు కూడా ప్రారంభించారు. అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన మంత్రి అధికారులతో మాట్లాడారు. నగరం మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జూన్ 19 నుంచి 21 వరకు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం 22 నుంచి జులై 20 వరకు హైదరబాద్‌లో ఆషాడమాస బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 22న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించనున్నారు. జులై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి జాతర, జూలై 10న రంగం కార్యక్రమం నిర్వహించబోతున్నారు. జులై 16న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు నిర్వహించనున్నారు. జులై 20న చివరి బోనంతో నగరంలో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రతీ ఏడు నిర్వహించినట్టే ఈ ఏడు కూడా ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.