Ayodhya: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నరేంద్ర మోదీ.. తేదీ ఖరారు చేసిన ఆలయ కమిటి

భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అయోధ్య రామ మందిర నిర్మాణం. దీని ప్రారంభోత్సవ తేదీని ప్రకటించింది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని స్పష్టం చేసింది.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 08:21 AM IST

రామ మందిరం, దేశ రాజకీయాల్లో ఇది అత్యంత సున్నితమైన అంశంగా చెప్పాలి. బీజేపీ కొన్ని దశాబ్దాలుగా శ్రీరాముడిని వాడుకుంటూ రాజకీయాలు చేస్తూ వచ్చింది. గతంలో లాల్ కృష్ణా అద్వానీ మొదలు నేడు నరేంద్రమోదీ వరకూ అందరూ శ్రీరాముని భక్తులుగానే వ్యవహరించారు. అయితే ఇన్ని దశాబ్ధాలుగా నెరవేరని కల మోదీ రెండవసారి అధికారంలోకి రావడంతో ఈ ఆలయంపై ఉన్న కేసు కొలిక్కి వచ్చింది. ఇది హిందువుల పుణ్యభూమి శ్రీరాముడు నడయాడిన ఆనవాళ్లు ఉన్నాయని కోర్టులో తీర్పును అనుకూలంగా వచ్చింది. దీంతో బీజేపీ తన సాఫ్ట్ హిందుత్వను బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం దక్కింది. అయితే ఈ ఆలయాన్ని 2024 ఎన్నికల్లోపు నిర్మించి భక్తులకు ప్రవేశం కల్పిస్తామన్నది బీజేపీ గతంలో చెప్పిన మాట. అందుకు అనుగుణంగానే జనవరిలో ఈ ఆలయ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో మరోసారి కూడా కేంద్రంలో హిందూ ఓట్లను కీలకంగా మలుచుకొని అధికార పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్నట్లు కొందరి అభిప్రాయం.

అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 2024, జనవరి 22గా ఖరారైంది. జనవరి 20 నుంచి 24 మధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాల్గొంటున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో  నిర్మించినట్లు తెలిపారు. ఈ ఏడాది డిశంబర్ లోపూ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. జనవరి 14 న సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  సీతారామచంద్రుల విగ్రహాలను ప్రతిష్టించిన తరువాత సామాన్య భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి కల్పించనున్నట్లు వివరించారు. పాత శ్రీరాముని విగ్రహం ముందే ప్రస్తుత భగవంతుని ప్రతిమను ఏర్పాటు చేస్తామన్నారు.

నరేంద్ర మోదీ పర్యటనను ఫిబ్రవరిలో పెట్టుకోవల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. అయితే ఫిబ్రవరిలో ప్రధానికి అనేక విదేశీ పర్యటనల షెడ్యూల్ ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో జనవరి కి మార్చినట్లు తెలిపారు. ప్రధాని భద్రత దృష్ట్యా అనేక ప్రత్యకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

T.V.SRIKAR