YS Jagan : వైసీపీని మింగేసిన తిమింగళాలు.. మేలుకో జగన్.. వాళ్లను వదిలించుకో..

రాజకీయాల్లో ఓటమి పెద్ద విషయం కాదు.. ఓడలు బండ్లు అవుతాయ్.. బండ్లు ఓడలవుతాయ్‌. వైసీపీకి ఎదురైన పరాభవం మాత్రం అలాంటిది ఇలాంటిది కాదు. జనం అంతా కలిసి వ్యతిరేకం అయినట్లు అనిపించాయ్ ఫలితాలు.

 

రాజకీయాల్లో ఓటమి పెద్ద విషయం కాదు.. ఓడలు బండ్లు అవుతాయ్.. బండ్లు ఓడలవుతాయ్‌. వైసీపీకి ఎదురైన పరాభవం మాత్రం అలాంటిది ఇలాంటిది కాదు. జనం అంతా కలిసి వ్యతిరేకం అయినట్లు అనిపించాయ్ ఫలితాలు. 2019లో 151సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 2024కు 11కు పడిపోయింది. కనీసం పది శాతం సీట్లు కూడా సంపాదించుకోలేకపోయింది అంటే.. జగన్ ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉన్నట్లు ఉంటాను అంటే.. అదే అహంకారం చూపిస్తాను అంటే.. పార్టీ అడ్రస్ కూడా గల్లంతవుతుంది. ఐతే వైసీపీ ఈ పరిస్థితికి జగన్‌ కోటరీనే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చుట్టూ తిమింగళాలను చేర్చుకున్న జగన్‌.. వాటికే బలయ్యారు. ఇంకా నమ్మితే పార్టీ పూర్తిగా బలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మేల్కొని.. తప్పు ఎక్కడ జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో.. అసలు తప్పు ఎవరితో తెలుసుకోవాలి. చెక్‌పెట్టాల్సిన అవసరం ఉంది.

జగన్ అధికారంలోకి రాగానే.. ఆయన చుట్టూ బలమైన కోటరీ ఏర్పడింది. ఆ కోటరీ ఇనుప గోడల లాగా మారి బయటి ప్రపంచంతో జగన్‌కు సంబంధం పూర్తిగా తుంచేసింది. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే.. వాటిని ఆయనకు ఇష్టమైన రీతిలో వక్రీకరించి కోటరీ తెలియజేసే దుర్మార్గమైన పనిచేసింది. జగన్‌ సలహాదారులు, సహాయకుల గురించి వారి పెత్తనం గురించి ప్రత్యర్థులు మాట్లాడే మాటలను పక్కన పెడితే.. సొంత పార్టీ వారే ఎన్నో సందర్భాల్లో విమర్శలు చేశారు. తన పార్టీ నాయకులు చెప్తున్న మాటలు కూడా జగన్‌కు చేరకుండా చేసింది ఆ కోటరీ. సీఎం కోటరీలో కీలక నాయకులు… ఎంతమంది ఎన్ని వందల వేల కోట్ల రూపాయల అక్రమార్జనలకు పాల్పడ్డారో లెక్కేలేదు. సాధారణంగా ఒకరికి లబ్ధి చేకూర్చే పనులు చేసినప్పుడు లంచం చేతులు మారడం, అవినీతి జరగడం సహజం! కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించడానికి కూడా భారీగా ముడుపులు సమర్పించవలసి వచ్చేదంటే.. ఆ కోటరీ నేతలు, కాదు కాదు తిమింగళాలు ఏ స్థాయిలో చెలరేగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టులన్నింటికీ పర్సంటేజీలు నిర్ణయించడం.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి నుంచి ముడుపులు పుచ్చుకుని బిల్లులు చేయడం.. సొంత పార్టీ కాంట్రాక్టర్లను అటూ ఇటూ కాకుండా బిల్లులు అందని దుస్థితిలో ఉంచడం జరిగింది.

ఇలా సలహాదారు ముసుగులో తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరించిన పెత్తందారీ పోకడలే పార్టీని నిండా ముంచాయ్. జగన్ కోటరీలోని ఎవరికైనా.. కనీసం జనాల కోణం నుంచి ఆలోచించే అలవాటు లేకుండా పోయింది. సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధనంజయ రెడ్డి, రిషి రాజు, కేఎన్ఆర్‌, రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. ఇలా ఎవరికీ జనాల కోణం తెలియదు.. ఒక్క పెద్దిరెడ్డి, చెవిరెడ్డికి తప్ప. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రధాన లోపం ఒకటే. నిత్యం జనాలకు క్షేత్రస్థాయిలో ఎవ్వరైతే కనిపిస్తూ ఉంటారో.. అలాంటి వారితో అధినేతకు సంబంధాలు తెగిపోయాయ్. సంక్షేమ పథకాలు డీబీటీ విధానం, వాలంటీర్ల వ్యవస్థ… ఇలా ఏ పేర్లతో అమలు చేసినా.. వాటి కారణంగా చివరికి జనాలకు, ఎమ్మెల్యేలకు కూడా సంబంధాలు లేకుండా ప్రభుత్వం తెంచేసింది. జగన్మోహన్ రెడ్డి, లబ్ధిదారులైన ప్రజలు మాత్రమే వ్యవస్థకు అటు ఇటు నిలిచారు. మధ్యలో మరెవ్వరూ లేకుండా.. జగన్ చుట్టూ ఉన్న తిమింగలాలు ఒక వ్యవస్థను రూపొందించాయి. వైసీపీ ఈ స్థాయికి దిగజారిందంటే.. పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయిన, అవుతున్న సజ్జల గురించే చెప్పుకోవాలి. మీడియా ముందు మాట్లాడడానికి భయపడే జగన్‌.. అందుకోసం సజ్జల మీద ఆధారపడడం.. జనాల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలను పంపింది.

నెంబర్ టూగా ఆయన బిల్డప్‌లకు పార్టీ మొత్తం ఆయన ఎదుటే సాగిలపడింది. మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయన డిక్టేషన్ ఇచ్చేవారు. సలహాదారులు అనేవారు జగన్‌కు అవసరమైన పనులు చేయడానికి, చెప్పిన పనిచేయడానికి చేసుకునే ఏర్పాటు కావాలి. అలా కాకుండా, జగన్‌ను శాసించే రాజ్యాంగేతర శక్తులుగా వారు మారితే ఇక ఆ పార్టీని ఎవరు కాపాడగలరు… వైసీపీలో పరిస్థితి అలాగే తయారైంది. సజ్జల వల్లే పార్టీ సగం నాశనం అవుతుందని అందరూ అనుకుంటూ ఉండగా.. కొడుకు సజ్జల భార్గవ్‌ను తీసుకువచ్చి సోషల్ మీడియా సారథ్యం ఆయన చేతిలో పెట్టిన తర్వాత.. పతనం పరిపూర్ణం అయింది. పార్టీని పూర్తిగా కూల్చేయడానికి ఈ తండ్రీకొడుకులు చాలా కష్టపడ్డారు. సోషల్ మీడియాపార్టీ సెటప్‌ను… దేశంలోనే మరే ఇతర పార్టీకి లేనంత పటిష్టంగా రూపొందించిన అంతకుముందు వారిని భార్గవ్ బయటకు పంపారు. సోషల్ మీడియా ప్రచారాల మీద నెలవారీగా కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు. ఐనా ఫలితం మాత్రం సున్నా అయింది.

ఇక మరో దారుణం ఏంటంటే.. సీఎం అపాయింట్మెంట్ కూడా లంచాల ద్వారా మాత్రమే దక్కడం. జగన్ సర్కిల్‌లోని తిమింగలాలకు మాత్రమే ఇది సాధ్యం అయింది. జగన్ అపాయింట్మెంట్లు చూసే KNR మీద ఈ తరహా ఆరోపణలు చాలా వచ్చాయ్. ఇక సీఎంను శాసించే స్థాయి కోటరీ తిమింగలంగా ముద్రపడిన ధనంజయరెడ్డి వ్యవహారం మరీ దారుణం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఓకే అయ్యే వ్యవహారం మొత్తం ఆయన చేతుల మీదుగా సాగేదని అంటారు. ప్రతి బిల్లు చెల్లింపులోనూ 8 నుంచి 10 శాతం అనేది ఫిక్స్‌డ్ ధరగా నిర్ణయించి ఆయన కమిషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయ్. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ట్రంప్ అవినాష్ అనే ఇద్దరు.. పార్టీని నిండా ముంచారు. ప్రతీ నెలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి… రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలకు వీళ్లే సారథులు. ఐదేళ్లలో ఎక్కడో ఒకచోట ప్రజా వ్యతిరేకత వీరికి కనిపించలేదంటే.. అది కచ్చితంగా అబద్దమే ! సర్వేల ముసుగులో, ప్రజాభిప్రాయాన్ని పసిగట్టి… పార్టీ విధానాలు మార్చుకోవడానికి ఉపయోగపడి ఉండాలి. ఐతే వీరంతా తమస్వార్థం చూసుకున్నారే తప్ప.. పార్టీకి ఉపయోగపడింది సున్నా. OSD కృష్ణమోహన్ రెడ్డి అవినీతి గురించి.. ఫిర్యాదులు అప్పుడూ ఇప్పుడూ కూడా వినిపిస్తూనే ఉన్నాయ్.

జగన్‌ పేరు ఉపయోగించుకొని.. హైదరాబాద్‌లో బాగానే ఆస్తులు వెనకేశారు. ఇక లిక్కర్ మాఫియా బాగోతాలను మొత్తం నడిపించిన కింగ్ పిన్‌గా రాజ్ కసిరెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక పెద్దిరెడ్డి జనం నాడి తెలిసిన నాయకుడే గానీ.. అధికారం అనేది పూర్తిగా తన సొంత వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే అన్నట్టుగా ఆయన వాడుకున్నారు. అటు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ చాలా నమ్మారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేతిలో టీటీడీని పెట్టారు. టీటీడీ పరిపాలన వ్యవస్థను.. ఆ రూపణంలో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడంలో వైవీ తన వంతు పాత్ర పోషించారు. నాలుగేళ్లు ఆ పదవిని వెలగబెట్టిన తర్వాత.. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ సారథ్యం అప్పగిస్తే.. అక్కడ కూడా పార్టీని సర్వనాశనం చేశారు. టీటీడీ విషయంలో ఈవో ధర్మారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జగన్ అండ చూసుకుని.. మొత్తం ప్రభుత్వ పార్టీ వ్యవస్థలను పురుగుల్లా చూసిన అధికారి ఆయన! పెద్దిరెడ్డి, సజ్జల తప్ప.. మరొకరి మాట వినేవారు కాదు. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరే.. ప్రభుత్వాన్ని అనేక రకాలుగా భ్రష్టు పట్టించి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఇక విజయసాయిరెడ్డి.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 అనిపించుకోవడంలో సజ్జలతో పోటీపడిన నాయకుడు. ఆయన పార్టీకి నిజాయితీగా చేసిందేమీ లేదు. పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా జగన్ ఇచ్చిన గౌరవాన్ని.. ఆయన పూర్తిగా స్వార్థానికి వాడుకున్నారు. కేంద్రంలోని పెద్దలతో వ్యక్తిగత భేటీలన్నీ.. తన ప్రాపకం కోసం ఉపయోగపడేలా మార్చుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ తర్వాత వినడం, చూడడం మానేశారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరాజయం నుంచి పాఠాల నేర్చుకున్నారా? అంటే అది కూడా లేదు. జగన్‌ చుట్టూ కోటరీ అలానే ఉంది. పార్టీని మింగేసే తిమింగళాల్లా కనిపిస్తున్నాయ్ అవన్నీ. ఇప్పటికీ జగన్‌ను మబ్బులో పెట్టడానికే పనిచేస్తున్నాయ్. తెగించిన ఒకరిద్దరు ప్రెస్ మీట్లు పెట్టి.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. వారి వైఖరి తెలిసిన వారంతా.. ఆ మాట ఎత్తాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు. ఈ కోటరీ బ్యాచ్‌లో ఒక్కరొక్కరుగా దూరం నెట్టకపోతే.. భారీ ప్రమాదమే. ఇప్పటికైనా మేలుకో జగన్.. మరొకరి మీద ఆధారపడకుండా సమీక్షలు చెయ్‌.. అప్పుడే ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.