ST, SC Act, Chandrababu : వర్గీకరణకు నాంది పలికింది చంద్రబాబే..

దేశమంతా ఇప్పుడు వర్గీకరణ గురించే చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు వెలువరించిన ఈ చారిత్రక తీర్పు.. కోట్ల జీవితాల్లో వెలుగులు నింపబోతోంది.

దేశమంతా ఇప్పుడు వర్గీకరణ గురించే చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు వెలువరించిన ఈ చారిత్రక తీర్పు.. కోట్ల జీవితాల్లో వెలుగులు నింపబోతోంది. అయితే.. దాదాపు 30 ఏళ్ల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి నాంది పడింది ఉమ్మడి ఏపీలోనే.. అది కూడా చంద్రబాబు హయాంలోనే అని మీకు తెలుసా? అవును. దేశంలో ఈ వర్గీకరణ పోరాటానికి పునాది వేసిందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. 1996లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఓ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఎస్సీలో రిజర్వేషన్లు అందని వర్గాలను ఎంపిక చేసి వాళ్లను వెనకబడినవాళ్లుగా గుర్తించారు. ABCD అని 4 వర్గాలుగా వాళ్లను విభజించారు. 15 శాతం రిజర్వేషన్‌ A గ్రూప్‌కు, ఒక్క శాతం రిజర్వేషన్‌ B గ్రూప్‌కు 6 శాతం రిజర్వేషన్‌ C గ్రూప్‌కు, ఒక్క శాతం రిజర్వేషన్‌ D గ్రూప్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

దీనికోసం ప్రత్యేకంగా ఏపీ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ యాక్ట్‌ అనే చట్టాన్ని కూడా రూపొందించారు. కానీ దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఈవీ చిన్నయ్య పిటిషన్‌ కూడా ఒకటి. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేయడంతో చిన్నయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇలా వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని వాదించారు. ఐదుగురు సభ్యులతో కూడా ధర్మాసనం కేసును విచారించింది. పిటిషనర్‌ తరుపు వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. వర్గీకరణను నిలిపివేసింది. ఇదే సమయంలో పంజాబ్‌ ప్రభుత్వం చేసిన వర్గీకరణ చట్టంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. పంజాబ్‌, హర్యానా కోర్టులో దాఖలైన పిటిషన్స్‌లో ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఏపీ కేసులో ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. దీంతో హైకోర్ట్‌ పంజాబ్‌ చేసిన చట్టాన్ని వ్యతిరేకించింది. దీంతో ప్రభుత్వం అప్పుడు సుప్రీంను ఆశ్రయించింది.

ఈ కేసును ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్‌ చంద్రచూడ్‌తో సహా మరో ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. సుదీర్ఘ వాదనల తరువాత 2024 ఫిబ్రవరిలో తీర్పును రిజర్వ్‌ చేసింది. ఒక సామాజికవర్గంలో ఉపకులాలను వర్గీకరించుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని.. ఆర్టికల్‌ 16/4 ప్రకారం అది సాధ్యమే అన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం ఏకీభవించింది. ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా తోసిపుచ్చి.. వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ తీర్పునిచ్చింది. ఇలా దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న ఈ వ్యవహారానికి పునాది ఏపీలోనే పడింది.