దేశమంతా సోషల్ మీడియాకు అతుక్కుపోయి.. అనంత్, రాధికా అంబానీ పెళ్లి వేడుకలను ఎంజాయ్ చేసింది. తెలిసిన వాళ్ల ఇంట్లో వేడుక అన్న రేంజ్‌లో.. జనాలు చాలామంది. ఈ పెళ్లి మీద ఆసక్తి చూపించారు. బిజినెస్, సినిమా, పొలిటికల్.. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా అనంత్ పెళ్లిలోనే కనిపించారు. నభూతో అన్న రేంజ్‌లో ముద్దుల కొడుకు పెళ్లి చేశాడు ముఖేష్ అంబానీ. చాలా చోట్ల ఎమోషనల్ అయ్యారు కూడా ! పెళ్లి మండపం నుంచి భోజనాల వరకు.. అతిధి మర్యాదల నుంచి వాళ్లకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అంబానీ.
ముంబైలోని జియోవరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్, రాధిక.. మూడు ముళ్ల బంధంలో ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకలో అంబానీ కుటుంబం అంతా.. సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కొడుకు అనంత్ పెళ్లిలోనూ నీతా అంబాని సరికొత్తగా కనిపించారు. ఐతే ఈ పెళ్లిలో నీతా అంబాని చేతిలో గణనాథుడి ఫోటో, దీపంతో కూడిన ఓ విచిత్రమైన వస్తువుతో కనిపించారు నీతా. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. దీంతో అసలు ఇదేంటి.. ఆమె చేతిలో ఎందుకుందనే చర్చ మొదలైంది. నీతా చేతిలో కనిపించింది గుజరాతీ పెళ్లిల్లో కనిపించే సాంప్రదాయ వస్తువు.
దీన్ని రామన్ దివో అంటారు. దీనికి గుజరాతీల పెళ్లిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికొడుకును మండపంలోకి తీసుకువచ్చే సమయంలో… అతడి తల్లి దీన్ని పట్టుకుని ముందు నడుస్తారు. ఇలా కొడుకు పెళ్లిలో ఈ దీపం నీతా అంబానీ చేతిలో కనిపించింది. రామన్ దివోను గుజరాతీలు శుభప్రదంగా భావిస్తారు. పెళ్లి బంధంతో నూతన జీవితాన్ని ప్రారంభించే దంపతులకు ఆశీర్వాదం అందిస్తుందని వారి నమ్మకం. వీరి జీవితంలో చీకటిని పారదోలి కొత్త వెలుగులు నింపేదిగా రామన్ దివోను భావిస్తారు. అందువల్లే సాంప్రదాయ గుజరాతీ పెళ్లిళ్లలో ఇది తప్పకుండా కనిపిస్తుంది.