బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నమెంట్ ఆరంభానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండగా… ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు దిగజారాయి. రిజర్వేషన్లపై రచ్చతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోగా ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ వరల్డ్ కప్ నిర్వహించడం కష్టమే. తాజాగా బంగ్లాలోని పరిస్థితులను ఐసీసీ కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధికారులు మాట్లాడారు. ఇప్పటికిప్పుడే ఏ నిర్ణయం చెప్పకున్నా టోర్నీ నిర్వహణకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని తేలిపోయింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మెగా టోర్నమెంట్‌ను ప్రత్యామ్నాయ వేదికలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. భారత్, శ్రీలంక, యూఏఈలను ప్రత్యామ్నాయ వేదికలుగా ఎంచుకున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. భారత్ , శ్రీలంకలలో ఏదో ఒక దేశానికి ఆతిథ్య హక్కులు దక్కొచ్చు. కాగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ అక్టోబర్ 3 నుంచి ఆక్టోబర్ 20 వరకు జరగనుంది.