కృష్ణ జింకను చంపిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బిష్ణోయ్ తెగ కృష్ణ జింకను దేవతగా పూజిస్తారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలిన తర్వాత ఆ తెగకు చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను చంపుతా అంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సిద్దు మూసేవాలా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిష్ణోయ్ తన అనుచరుల ద్వారా సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఒక ఘటన సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టింది. సల్మాన్ ఖాన్ ఇంటిపై విక్కీ కుమార్ గుప్తా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సల్మాన్ ఖాన్ కు ఏ గాయాలు కాలేదు. అయితే అతను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటీషన్ లో అతను ప్రస్తావించిన అంశాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన నిందితుడు… తనకు అప్పులు ఉన్నాయని అందుకే సల్మాన్ ఇంటి మీద కాల్పులు జరిపా అంటూ వెల్లడించాడు.
తనకు అసలు గతంలో నేర చరిత్ర లేదని స్పష్టం చేసాడు. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ను చూసి తాను ప్రభావితం అయ్యానని కాని ఈ కేసులో అసలు లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం లేదని పేర్కొన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ నుండి గుప్తాకు ఎటువంటి కాల్ రాలేదని లేదా బిష్ణోయ్‌తో మాట్లాడమని ఎవరూ చెప్పలేదని… గుప్తా తరుపు లాయర్ కోర్ట్ కి వివరించారు. సల్మాన్ ను చంపే ఉద్దేశం తనకు లేదని అన్నాడు. అందుకే ఈ దాడిలో ఎటువంటి అధునాతన ఆయుధాన్ని ఉపయోగించలేదు అని నాటు తుపాకి వాడినట్టు పేర్కొన్నాడు. సల్మాన్ ఖాన్ ను భయపెట్టడమే తన లక్ష్యం అన్నాడు.