ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ హీటెక్కాయి. కొందరు సినిమా హీరోలు కూడా పాలిటిక్స్ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ హీరో నితిన్
కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న లిస్టులో ఉన్నారని మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే నితిన్ బంధువులు కొందరు రాజకీయాల్లో ఉండటంతో ఈ గుసగుసలకు మరింత బలం చేకూరుతోంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన నితిన్ కుటుంబం చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంది. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి పేరున్న నిర్మాత.
నితిన్ రక్త సంబంధీకులు కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మేనమామ నగేష్ రెడ్డి గతంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీకి 10 సంవత్సరాల పాటు చైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డితో నగేష్ రెడ్డి భేటీ అయ్యారు.
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సీటుపై తనకు ఆసక్తి ఉందని నగేష్ రెడ్డి చెప్పారని సమాచారం. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మధుయాష్కి ఒకవేళ పోటీ చేయకుంటే.. నితిన్ ను అక్కడి నుంచి బరిలోకి దింపాలని విజ్ఞప్తి చేసినట్టు చర్చ కొనసాగుతోంది. అయితే సర్వేల ఆధారంగానే టికెట్ కేటాయింపు ఉంటుందని నగేశ్‌కు రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఈనేపథ్యంలో హీరో నితిన్ ద్వారా టికెట్ కోసం నగేశ్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి నితిన్ స్వయంగా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ లేదా నిజామాబాద్ లోక్ సభ బరిలోకి దిగుతారా ? మేనమామకు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇప్పించేందుకు ట్రై చేయడానికి పరిమితం అవుతారా ? అనేది వేచి చూడాలి.
కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తే..
ప్రస్తుతం బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టికెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేతలు అరికెల నర్సారెడ్డి, భూపతిరెడ్డి కూడా దృష్టి పెట్టారు. వారిని కాదని.. తన మేనమామకు టికెట్ ఇచ్చేలా నితిన్ చక్రం తిప్పగలుగుతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న! మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరింత స్ట్రాంగ్ కావాలని భావిస్తున్న బీజేపీ.. హీరో నితిన్‌ను తమ వైపు లాగేందుకు యత్నిస్తోందని అంటున్నారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సీటు కేటాయింపుపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం ఆధారంగా నితిన్ పొలిటికల్ ప్లాన్ ను తయారు చేసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ తనకు ఆసక్తి లేకుంటే.. తన మేనమామ నగేష్ రెడ్డికి ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ ఇప్పించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
నితిన్ ను దిల్ రాజు ఢీకొడతారా ?
నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ మూవీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి, ప్రొడ్యూసర్ దిల్ రాజు మధ్య వివాదం ఏర్పడిందని.. దీంతో
దిల్ రాజు, ప్రముఖ హీరో నితిన్ మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు. దిల్ రాజు, హీరో నితిన్ ఇద్దరిది నిజామాబాద్ జిల్లానే. ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో ఎక్కడి నుంచి అయినా గెలుస్తానని దిల్ రాజు బహిరంగంగానే అంటున్నారు. ఓవైపు నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై నితిన్ ను బరిలోకి దింపాలని ఆయన మేనమామ నగేష్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు ఇదే స్థానం నుంచి దిల్ రాజును బరిలో నిలపాలని అధికార బీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసిన సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.