హైదరాబాద్ పాలిటిక్స్ అనగానే ఒవైసీ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది.. ఒవైసీ ఫ్యామిలీని మైనస్ చేసి పాత బస్తీని చూడలేం.. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఒవైసీ ఫ్యామిలీకి చెందిన మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఒక కీలక మలుపు తీసుకోబోతోంది. మజ్లిస్ పార్టీ కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ వచ్చే పోల్స్ లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎంబీబీఎస్ చేసిన నూరుద్దీన్ ప్రస్తుతం ఎంఐఎం పార్టీకి చెందిన సలార్–ఎ–మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా, కార్యదర్శిగా పని చేస్తున్నాడు. నూరుద్దీన్‌ను ఎన్నికల బరిలోకి దింపాలని మజ్లిస్ పార్టీ క్యాడర్ ఒవైసీ బ్రదర్స్‌పై ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది. ఇటీవల మజ్లిస్ పార్టీ హెడ్ క్వార్టర్ దారుస్సలామ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఎంఐఎం కార్యకర్తలు.. “నూరుద్దీన్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన ఇవ్వండి” అని పట్టుబట్టారని సమాచారం. ఒవైసీ బ్రదర్స్ మాత్రం ప్రస్తుతానికి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఆ నాలుగు చోట్లపై ఫోకస్..
ఒకవేళ నూరుద్దీన్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫార్మ్ అయితే.. చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, యాకుత్‌పురా, చార్మినార్ లలో ఏదో ఒక స్థానం నుంచి ఆయనను ఒవైసీ బ్రదర్స్ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎంకు తిరుగుండదు. అక్కడి నుంచి గత ఐదు పర్యాయాలు వరుసగా నూరుద్దీన్ తండ్రి అక్బరుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు. మజ్లిస్ పార్టీ తొలిసారిగా 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి మల్లేపల్లి వార్డులో విజయం సాధించింది. 1978 నాటికి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ బలంగా నాటుకొని పోయింది. 1984లో తొలిసారి సలాహుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2004 దాకా ఆ సీటులో ఆయనే గెలిచారు. అనంతరం సలాహుద్దీన్ ఒవైసీ పెద్ద కొడుకు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అప్రతిహతంగా గెలుస్తున్నారు. సలాహుద్దీన్ ఒవైసీ చిన్న కొడుకు అక్బరుద్దీన్ ఒవైసీ. అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ ఒకవేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే .. ఆ ఫ్యామిలీ నుంచి నాలుగో తరం రాజకీయాల్లోకి ప్రవేశించినట్టు అవుతుంది. ప్రస్తుతం ఎంఐఎంకు తెలంగాణ అసెంబ్లీలో 7 సీట్లు ఉన్నాయి. వచ్చే పోల్స్ లో ఈ సంఖ్యను 15కు పెంచుకోవాలని మజ్లిస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకోసం మొదటి అడుగు తమ ఇంటి నుంచే పడేలా చూడాలని ఒవైసీ ఫ్యామిలీ యోచిస్తోందట.
బీఆర్ఎస్ కంటే మజ్లిస్ వేగమే ఎక్కువ..
బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా జాతీయ స్థాయిలో నెట్ వర్క్ ను విస్తరించుకున్న పార్టీ మజ్లిస్. ఈ పార్టీకి మహారాష్ట్ర, బెంగాల్, యూపీ, బీహార్ లలోనూ క్యాడర్ ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బలాన్ని పెంచుకోవాలని మజ్లిస్ భావిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకుగానూ కనీసం 50 చోట్ల పోటీ చేయాలనే ఆలోచన ఉందని గతంలో చాలా
సందర్భాల్లో మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేవలం ముస్లింలకే కాకుండా బలమైన అభ్యర్థులు ఇతర వర్గాల నుంచి ముందుకొచ్చినా టికెట్స్ ఇస్తామని ఆయన కామెంట్ చేసి దాఖలాలు ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లలో ఎంఐఎం పార్టీకి ఇప్పటికే క్యాడర్ ఉంది. అక్కడ క్యాడర్ ను మరింత పెంచుకోవడంతో పాటు క్యాడర్ లేని జిల్లాలలోకి ప్రవేశించడంపై కూడా ఒవైసీ బ్రదర్స్ వర్క్ అవుట్ చేస్తునట్టు తెలుస్తోంది.