తెలంగాణలో కాంగ్రెస్ సూపర్ జోష్‌లో కనిపిస్తోంది. ఈ జోష్‌ను అధికారం వరకు తీసుకెళ్లాలని.. హస్తం పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారు. వారిలో వారికి ఎన్ని విభేదాలు ఉన్నా.. పట్టు సాధింపు చర్యలు ఉన్నా.. కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే.. అందరి లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్‌ను గద్దె దించడం అన్నట్లుగా కనిపిస్తున్నారు. తగ్గితే తప్పేంటి.. తగ్గితే నెగ్గుతామని అనుకుంటే.. తగ్గడానికి సిద్ధం అన్నట్లుగా పార్టీలో సీనియర్లు, కీలక నేతలు కనిపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయ్.
బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తుమ్మల.. కాంగ్రెస్ తీర్థం పుచ్చేసుకున్నారు దాదాపుగా ! నిజానికి ఆయన ఎప్పుడో చేరాల్సింది. పాలేరు టికెట్ విషయంలో పీటముడి పడింది. ఇదే పాలేరు స్థానాన్ని షర్మిలతో పాటు పొంగులేటి కూడా కోరుతున్నారు. ఐతే పాలేరు సస్పెన్స్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షురాలు షర్మిల అనుకున్నది సాధించినట్లు కనిపిస్తున్నారు. వైటీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల ఎప్పటి నుంచో పావులు కదుపుతున్నారు. ఆంధ్రా రాజకీయాల్లోకి వెళ్లేది లేదని.. తెలంగాణలోనే సత్తా చాటుతానని పదేపదే చెప్పిన షర్మిల.. తనకు పాలేరు టికెట్ కావాలని కాంగ్రెస్ పెద్దల ముందు ప్రధాన డిమాండ్ పెట్టింది. దీనికోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయం తీసుకుంది. ఆయన చొరవ చూపించి.. కాంగ్రెస్ అధిష్టానం, షర్మిల మధ్య డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో సీడబ్ల్యూసీ మీటింగ్ పూర్తయ్యేలోపు.. షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక అటు పాలేరు విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఈ స్థానం మీద షర్మిలతో పాటు పొంగులేటి, తుమ్మల కూడా ఆశలు పెట్టుకున్నారు. ఐతే డీకే శివకుమార్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. షర్మిల కోసం ఈ స్థానాన్ని తుమ్మల త్యాగం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపులు, హామీలతో.. పాలేరు విషయంలో తుమ్మల వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తుమ్మలకు పాలేరు నియోజకవర్గ టికెట్‌కు బదులుగా ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ కీలక నేతలు మంతనాలు చేశారు. తుమ్మల కూడా దీనికి అంగీకరించారు. ఇక అటు పొంగులేటికి కొత్తగూడెం ఫిక్స్ చేశారు. దీంతో ఖమ్మం పంచాయితీకి కాంగ్రెస్‌లో ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడినట్లు అయింది. షర్మిల, తుమ్మల, పొంగులేటి.. ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఉండబోతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమ పార్టీని అడ్డుకునే వారు కూడా ఉండరని కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీలో కనిపిస్తున్నాయ్.