టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ లేని విధంగా అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న హిట్ మ్యాన్ ఆసీస్ టూర్ తో రెడ్ బాల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడంటూ చర్చ జరుగుతోంది. తాజాగా గబ్బా టెస్టులో అతను చేసిన పనితో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తొలి రెండు టెస్టుల్లోనూ నిరాశపరిచిన రోహిత్ ఈ మ్యాచ్ లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా కెప్టెన్.. కమ్మిన్స్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ డ్రైవ్ చేయబోయి వికెట్ కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఔటైన తర్వాత హిట్ మ్యాన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. పెవిలియన్ కు వెళుతూ డగౌట్ దగ్గరకు రాగానే కోపంతో గ్లోవ్స్ విసిరికొట్టాడు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అవుతాడనే ఊహాగానాలు వస్తున్నాయి.
ఇటీవల రోహిత్ బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమవుతున్నాడు. ఈ సిరీస్ లో తొలి టెస్టుకు దూరమైన రోహిత్.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 3.. రెండో ఇన్నింగ్స్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఏడాది కాలంగా టెస్టుల్లో రోహిత్ పేలవ ఆటతో భారత జట్టుకు భారంగా తయారయ్యాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోకపోయినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాతి నుంచే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని, అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ సారథ్యం వహిస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే వ్యక్తిగతంగానూ రోహిత్ ఫామ్ కోల్పోయాడు. హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ చేసి దాదాపు 10 నెలలు దాటిపోయింది. 2013లో టెస్ట్ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 66 టెస్టుల్లో 4290 పరుగులు చేశాడు. దీనిలో 12 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జైశ్వాల్ తో కలిసి కెఎల్ రాహుల్ ఓపినింగ్ చేస్తుండడంతో రోహిత్ ఆరో స్థానంలో ఆడుతున్నాడు.