Chandrababu Naidu: ముందస్తుకు టీడీపీ సిద్ధంగా లేదా.? ఎందుకని.?

తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్దంగా లేదా..? ఎన్నికలకు సరైన గ్రౌండ్ ఇంకా సెట్‌ కాలేదని భావిస్తోందా..? ముందస్తు అంటూ ముందు నుంచి ఊదరగొట్టిన సైకిల్ అసలు సమయంలో ఎందుకు షేక్ అవుతోంది.?

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 07:12 AM IST

తెలుగుదేశం పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్దంగా లేదా..? ఎన్నికలకు సరైన గ్రౌండ్ ఇంకా సెట్‌ కాలేదని భావిస్తోందా..? ముందస్తు అంటూ ముందు నుంచి ఊదరగొట్టిన సైకిల్ అసలు సమయంలో ఎందుకు షేక్ అవుతోంది.?

తమ్ముళ్లు సిద్ధంగా లేరా.?
కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, అత్యవసర పార్లమెంట్‌ సమావేశాలను పరిశీలిస్తే ముందస్తు దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. జమిలీ ఎన్నికలపై కేంద్రం కసరత్తు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు తప్పవని అన్ని పార్టీల్లానే టీడీపీ కూడా భావిస్తోంది. కానీ ఎన్నికలకు మాత్రం ఆ పార్టీ ఇంకా సిద్ధమైనట్లు కనిపించడం లేదు. మరికొంత కాలం ఆగితేనే తమకు సరైన గ్రౌండ్ సిద్ధమవుతుందని ఇప్పుడే ముందస్తు జరిగితే అనుకున్నన్ని సీట్లు రావని ఆ పార్టీ నేతలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. కొందరు మేం రెడీ అంటుంటే మరికొందరు మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు.

ఇంకొంత కాలం ఆగితే.!
టీడీపీలో మరో చర్చ కూడా నడుస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో లేదు. మరికొంతకాలం ఆగితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి తమకు కలసి వస్తుందని తెలుగుదేశం అంచనా వేస్తోంది. ఆర్థికంగా నిధుల కటకట ఎదుర్కొంటున్న ప్రభుత్వం మరికొంతకాలం తర్వాత ఇంకా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అప్పుడు ప్రజలు, ఉద్యోగులు తమవైపు మొగ్గుతారన్నది టీడీపీ అంచనా. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే జగన్ ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కుతుందని తమ్ముళ్లు భావిస్తున్నారు.

ఇంతకాలం ఏం చేశారు.?
ఏడాది, ఏడాదిన్నర నుంచే ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఊదరగొట్టేశారు. జగన్ ప్రభుత్వం ముందస్తుకు వెళుతుందని ముందు నుంచే చెబుతూ వచ్చారు. అసలు వైసీపీకి ఆ ఆలోచన ఉందో లేదో కానీ టీడీపీ మాత్రం తెగ ప్రచారం చేసింది. కానీ అసలు సమయం వచ్చేసరికి ఇప్పుడు బిత్తర చూపులు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ముందస్తుకు స్పష్టమైన సంకేతాలు కన్పిస్తున్న ఈ తరుణంలో ముందస్తు పేరు చెబితే టీడీపీలోని కొందరు నేతలు ఉలిక్కి పడుతున్నారు. ముందస్తు ఉంటుందని ముందు నుంచే అంచనాతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. కొన్ని సీట్లల్లో అభ్యర్థులను కూడా ఖరారు చేసేసిన పరిస్థితి. కానీ కొన్ని కీలకమైన స్థానాల్లో ఇప్పటికీ కసరత్తు పూర్తి కాలేదు. సుమారు 50 నుంచి 60 స్థానాల్లో ఎన్నికలకు అభ్యర్థులను ఫిక్స్ చేయాల్సి ఉంది. దీంతో ముందస్తు ఎన్నికలంటే టీడీపీలో కొందరు నేతలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి.

నిధుల కటకట
ఆర్థిక అంశాలు కూడా టీడీపీ నేతలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్న అంచనాతో వనరులను సమకూర్చోవడాన్ని కాస్త ఆలస్యం చేశారు. అటు వైసీపీ పక్కా ప్రణాళికతో ఇప్పటికే నిధులను నియోజకవర్గాలకు తరలించేసినా టీడీపీ నేతలు ఇంకా సేకరించడంపైనే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ముందస్తు అనేసరికి వారి నెత్తిన పిడుగు పడింది. ఈ నెలాఖరులోపు కేంద్రం జమిలి ఎన్నికలకు పచ్చజెండా ఊపిందంటే మాత్రం .. ఆర్థిక వనరుల సమీకరణకు తెలుగుదేశం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ప్రతి ఓటూ కీలకమైన ఈ సమయంలో ఇది అసలుకే ఎసరు తెచ్చే వ్యవహారమే. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా ఆరు నెలల పాటు సమయం ఉంది కాబట్టి….ఇబ్బందేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ముందస్తు ముంచుకొచ్చేసరికి కోట్లాది రూపాయలు సమీకరించుకోవడం కష్టమేననేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీంతో జమిలీ కాకుండా.. ముందస్తు కాకుండా.. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగాలని కోరుకునే వారు టీడీపీలో చాలామందే ఉన్నారు.

ఆర్థికంగా సిద్దంగా ఉన్న నేతలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా..? అని ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఆ పార్టీలో కనిపిస్తోంది. ఇదే సందర్భంలో జమిలీ ప్రచారంతోనైనా చంద్రబాబు టిక్కెట్ల పంచాయతీని వీలైనంత త్వరగా తేల్చేస్తారేమోననే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.