Prime Minister: ఇండియా కూటమిలో ‘ప్రధాని అభ్యర్థి’ చిచ్చు.. రేసులో ఉన్నదెవరు ?

జాతీయ రాజకీయాల్లో దేశ ప్రధాని అభ్యర్థి ఎవరు అనే దానిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 02:31 PM IST

కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్ధి ఎవరు ? అనే అంశం మరోసారి హాట్ హాట్ గా మారింది. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబై వేదికగా ‘ఇండియా’ మీటింగ్ జరగనున్న తరుణంలో దీనిపై కూటమిలోని పలు పార్టీలు చర్చకు తెరలేపాయి. ఈవిషయంలో తొలి స్థానంలో కాంగ్రెస్ పార్టీయే ఉంది. రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఇటీవల కామెంట్ చేయగా.. అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థి అయితే బాగుంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ ఈరోజు అన్నారు. దీంతో దేశవాణిజ్య రాజధానిలో రేపు (ఆగస్టు 31న) మొదలుకానున్న ఇండియా మీటింగ్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీని బలంగా ఎదుర్కోవడంపై, కూటమి పక్షాల మధ్య ఐక్యతను సాధించడంపై, సీట్ల సర్దుబాటుపై గురువారం జరగనున్న మీటింగ్ లో చర్చించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అయితే కూటమిలోని కీలక నాయకుల తాజా వ్యాఖ్యలతో ‘ప్రధాని అభ్యర్థి’ అంశం కూడా ఇప్పుడు ఆ మీటింగ్ ఎజెండాలో చేరిపోయిందని రాజకీయ పండితులు అంటున్నారు.

ఎవరి వాదన ఏమిటి ?

భారత్ జోడో యాత్ర, ప్రధాని మోడీపై రాజీలేని పోరాటం అనేవి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిత్వ రేసులో ముందంజలో నిలిపాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వాదిస్తున్నారు. దేశంలో మోడీకి ప్రత్యామ్నాయ ముఖంగా రాహుల్ గాంధీ కనిపిస్తున్నారని వారు అంటున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ తాజాగా బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ మోడల్’ గురించి యావత్ దేశం ఆలోచించాలని కోరారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. ఢిల్లీపై దాని ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదని ఆమె అన్నారు. ఉచిత తాగునీరు, విద్య, విద్యుత్, మహిళలకు బస్ సర్వీస్‌లు వంటివి ఢిల్లీ ప్రజలను సంతోషపరిచాయని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ఢిల్లీ మిగులు బడ్జెట్ తో ముందుకు సాగుతోందని ప్రియాంకా కక్కర్ చెప్పారు. మోడీ సర్కార్ వైఫల్యాలు, విద్యార్హతలు సహా ప్రతి అంశాన్ని నిర్భయంగా ప్రస్తావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాన అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఆ సర్వేలు ఏం చెప్పాయి ?

ఇక ప్రధాని అభ్యర్ధి విషయంలో ప్రముఖ మీడియా సంస్థల తాజా సర్వే రిపోర్టులను ఒకసారి చూద్దాం. ‘NDTV-CSDS’ ఒపీనియన్ పోల్ సర్వేలో పాల్గొన్న వారిని.. ‘మోడీకి ధీటైన ప్రధాని అభ్యర్థి ఎవరు ?’ అని ప్రశ్నిస్తే 34 శాతం మంది రాహుల్ గాంధీ పేరు చెప్పారు. కేవలం 11 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్ పేరు చెప్పారు. మరో 5 శాతం మంది అఖిలేశ్ యాదవ్ పేరును, 4 శాతం మంది మమత బెనర్జీ పేరును ప్రస్తావించారు. ఇక ఏబీపీ మీడియా నిర్వహించిన ‘ABP C Voter’ ఒపీనియన్ పోల్ సర్వేలో ‘ప్రధానిగా ఎవరు కావాలి?’ అని ప్రజలను ప్రశ్నిస్తే.. 57 శాతం మంది నరేంద్ర మోడీ అని చెప్పగా, 18 శాతం మంది రాహుల్ గాంధీ అన్నారు. 8 శాతం మంది యోగి ఆదిత్యనాథ్, కేవలం 3 శాతం మంది కేజ్రీవాల్ పేర్లు చెప్పారు. వారం క్రితమే రిలీజ్ అయిన ‘ఇండియా టుడే – మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే రిపోర్టులోనూ 16 శాతం మంది దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. అరవింద్ కేజ్రీవాల్ ను సపోర్ట్ చేస్తున్న వారు ఐదుశాతం లోపే ఉన్నారని ఇందులో వెల్లడైంది. అత్యధికంగా 52 శాతం మంది దేశ ప్రజలు ప్రస్తుత ప్రధాని మోడీ వెంటే ఉన్నారని ‘ఇండియా టుడే – మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తేల్చింది.