Eetela Rajender: ఈటలకు భారీ షాక్ తగలబోతోందా ?

ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ నిమిషానికి ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది తెలంగాణ బీజేపీలో! అలకలు, అసంతృప్తులు, అసమ్మతి స్వరాలు.. వీటన్నింటి మధ్య అధ్యక్షుడి మార్పులు.. తెలంగాణ బీజేపీ వ్యవహారం కొత్త చర్చకు కారణం అవుతోంది.

  • Written By:
  • Publish Date - July 6, 2023 / 01:21 PM IST

కిషన్‌ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన బీజేపీ అధిష్టానం.. ఈటలకు ఎన్నికల కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించింది. ఐనా పార్టీలో పరిస్థితి క్లియర్ అయినట్లు కనిపించడం లేదు. బీజేపీకి చెందిన కీలక నేతలు.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ కావడం.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న జూపల్లితో.. బీజేపీ నేతలు భేటీ కావడం కొత్త చర్చకు కారణం అవుతోంది. జూపల్లితో భేటీ అయిన వారిలో.. ఈటల ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే కూడా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.

అనుచరుడి నుంచి ఈటలకు షాక్ తప్పదా అనే చర్చ జరుగుతోంది. జూపల్లిని కలిసిన వారిలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ అనుచరుడు పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారంతా కాంగ్రెస్‌లోని రావాలని జూపల్లి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఏనుగు రవీందర్ రెడ్డికి.. ఈటల అనుచరుడిగా పేరుంది. రెండేళ్ల కింద బీజేపీలో చేరిన రవీందర్ రెడ్డి.. ఈటలతో పాటే కలిసి నడుస్తున్నారు. ఐతే ఇటీవల ఈటల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించిన సమయంలో రవీందర్ రెడ్డి కనిపించలేదు.

కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని.. అందుకే తెరమీద కనిపించడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే.. ఈటలకు కోలుకోలేని షాక్ తగడం మాత్రం ఖాయం. మొన్నటివరకు బీఆర్ఎస్‌తో టగ్‌ ఆఫ్ వార్ అన్నట్లు కనిపించిన బీజేపీ.. ఇప్పుడు నేతలను కాపాడుకోలేని స్థాయికి చేరుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇంకెన్ని పరిణామాలు జరగుతాయనే టెన్షన్.. బీజేపీ శ్రేణులను వెంటాడుతోంది.