గట్టిగా లెక్క తీస్తే.. తెలంగాణలో ఎన్నికలకు మరో మూడు నెలల సమయం కూడా లేదు. సమయం దగ్గర ఉన్నా.. ఆ స్థాయిలో రాజకీయ వేడి కనిపించడం లేదు. ఐతే పాలిటిక్స్‌ను హీటెక్కించేలా.. పార్టీ శ్రేణులను పోరుకు పోటెక్కించేలా.. కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తుక్కుగూడ సభలో ఒక్క ప్రసంగంతో రాజకీయం రూపు రేఖలే మార్చాలని కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయ్యారు. ఈ సభతోనే కాంగ్రెస్ ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ఏకంగా 10లక్షల మందిని సభకు తరలించాలని ప్లాన్ చేసుకుంది. అంత మంది వస్తారా అన్నది పక్కన పెడితే.. ఈ సభ ద్వారా జనాలకు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కీలక అంశాలను చెప్పబోతోంది. అందువల్ల కాంగ్రెస్ ఇవ్వబోయే హామీలపై జనాల్లో కొంత ఆసక్తి ఉంది. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్, ప్రియాంక వస్తున్నారు. వీరు జనాలకు ఆరు హామీలపై గ్యారెంటీ కార్డులు ఇవ్వబోతున్నారు. సభ తర్వాత నియోజకవర్గాలకు వెళ్లి, ఈ కార్డులు ఇచ్చి.. తాము అధికారంలోకి వచ్చాక, ఈ హామీలను తప్పక అమలు చేస్తామనీ, అందుకు గుర్తుగా ఈ గ్యారెంటీ కార్డులు ఇస్తున్నామని చెప్పబోతున్నారు.
ఇప్పటికే ఈ హామీలపై కాంగ్రెస్ జోరుగా ప్రచారం సాగిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే చేసింది. హామీలు ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా.. వాటికి గ్యారెంటీ కార్డులు కూడా ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక, హామీలను నిలబెట్టుకుంటోంది కూడా. అందుకే, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకులు.. కాంగ్రెస్ హామీలను విశ్లేషిస్తున్నారు. ఈ హామీల వల్ల తెలంగాణకూ, తమకూ ఎంతవరకూ ప్రయోజనం ఉంటుంది అన్నది లెక్కలేసుకుంటున్నారు. అందుకే తుక్కుగూడ సభ కాంగ్రెస్‌కి కీలకం కాబోతోంది. ఇది తెలంగాణ ఎన్నికల ముఖచిత్రంపై కచ్చితమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఈ సభలో సోనియా గాంధీ ప్రసంగం హైలెట్ కానుంది. ఆమె ద్వారానే ఆరు హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. 5వందలకే గ్యాస్ సిలిండర్, యువ వికాసం కింద 2 లక్షల ఉద్యోగాల భర్తీ, దారిద్య్ర రేఖకు కింద ఉన్న మహిళలకు మహాలక్ష్మి పేరుతో 3 వేల పింఛను, చేయూత కింద 4 వేల పింఛను, రైతు భరోసాగా రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేలు, అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల చొప్పున ఆర్థిక సాయం హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది.