2024 నైరుతి రుతుపవనాల సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబరు వరకు… గతేడాది కంటే కూడా వర్షాలు భారీగా కురుస్తాయని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో గతేడాది నుంచి కొనసాగుతూ…. ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్‌నినో అప్పటికీ బలహీనపడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. తరువాత జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడుతుందని, ఆగస్టు నాటికి లానినా ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో కొనసాగితే ఆ ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడుతుంది. పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండి ఎండల తీవ్రత పెరుగుతుంది. వర్షపాతం తక్కువగా ఉంటుంది. కొన్నిచోట్ల ప్రకృతి విపత్తులు.. అంటే వరదలు, తుఫాన్లు, వడగాలులు ఏర్పడతాయి. పసిఫిక్ సముద్రంలో ఎల్ నినో ప్రభావం భారత ఉపఖండంపై కూడా తీవ్రంగా చూపిస్తుంది. గతేడాది నైరుతి సీజన్ లోని 4 నెలల్లో సాధారణ వర్షపాతం 868.6 మి.మీ. అయితే… 820 మి.మీ.గా నమోదైంది. జూన్‌లో కూడా ఎండల తీవ్రత తగ్గలేదు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత జూలైలో కొంతవరకు వానలు పడ్డాయి. మళ్లీ ఆగస్టులో వర్షాల్లేవు. సెప్టెంబరు నుంచి భారీగా వానలు పడ్డా… అప్పటికే వేసిన పంటలు దెబ్బతిన్నాయి. గతేడాది దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసిన ఎల్‌నినో… 2024లోనూ కొనసాగుతోంది. వచ్చే మార్చి నెల వరకు దీని తీవ్రత ఉంటుందనీ… ఏప్రిల్ నుంచి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వచ్చే జూన్, జూలైలో లానినో పరిస్థితులు ఏర్పడుతుండటంతో వచ్చే నైరుతిలో వర్షాలకు ఢోకా ఉండదు.
ఈ ఎండాకాలం మండుతుంది.
ప్రస్తుతం ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉండటంతో… గత వేసవి కంటే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇప్పటికే 2023 అత్యంత వేడి సంవత్సరంగా చెబుతున్నారు. ఆ రికార్డులను 2024 బద్దలు కొడుతుందేమో. ఎల్ నినో తటస్థ పరిస్థితులు ఏర్పడ్డాక… లానినా ఎంటర్ అయితే అప్పుడు ఎండల తీవ్రత తగ్గుతుంది. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను గమనిస్తే… జూన్ కల్లా లానినా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ట్రోపికల్ మేనేజ్‌మెంట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల నైరుతి రుతుపవనాలు అనుకున్న టైమ్ కంటే ముందే వచ్చి, మంచి వర్షాలు ఇస్తాయి. అయినా వేసవి తీవ్రత మాత్రం కొనసాగుతుంది. తుఫాన్ల తీవ్రత పెరగడం, కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.