దేశ వ్యాప్తంగా అన్ని టెలికాం నెట్వర్స్ యూజర్లకు అలర్ట్ మెసేజ్ లు వస్తున్నాయి. దీనిపై సామాన్యుల మొదలు సెలబ్రెటీల వరకూ అందరూ కాస్త ఆందోళన చెందారు. ఒకరు మొబైల్ ఏమైనా బ్లాస్ట్ అవుతుందేమో అనుకుంటే.. మరి కొందరు కేంద్రం ఎందుకు ఇలా పంపించింది అని ఆలోచనలో పడ్డారు. మెసేజ్ అలర్ట్ వచ్చిన వెంటనే వచ్చే అలారం ఈ ఆందోళనకు మరింత ఊతం ఇచ్చింది. అయితే టెస్టింగ్ లో భాగంగానే నెట్వర్క్ సంస్థలు ఇలా అలర్ట్ మెసేజ్ లను పంపినట్లు సెంట్రల్ గవర్నమెంట్ వివరించింది. ఇలా రావడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని సూచించింది.
కేంద్రం ఇచ్చిన సమాచారం ఇదే..
ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం లోని సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపిన ట్రయల్ మెసేజ్. మీరు ఓకే ని సెలెక్ట్ చేసే వరకూ అలారం మోగుతూనే ఉంటుంది. దీనిని వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాగే మీ నుంచి ఎలాంటి ప్రాసెస్ చేయనవసరం లేదు అని తెలిపింది. ఈ సందేశాన్ని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అమలు జరుపుతున్న ట్రయల్ రన్ గా పేర్కొంది. టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీనిని మరింత మెరుగు పరచడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సమయాల్లో హెచ్చరికలను జారీ చేసేలాగా ఇది పనిచేస్తుంది. దీని వల్ల ప్రజల భద్రతన మరింత మెరుగు పరిచేందుకు అవకాశం ఉంటుంది. దీనిని ఇప్పటి వరకూ మూడు భాషల్లో రూపొందించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో సందేశాన్ని అందిస్తుంది.
దీని ఉపయోగం ఏంటి..
ఇలాంటి సిస్టం చాలా వరకూ దేశాల్లో అమలులో ఉన్నాయి. మన దేశం ఇప్పుడే దీనిని ప్రయోగ దశలోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఆయా దేశాల్లో సంభవించే భూకంపాలు, తుఫాన్లు, ఉపద్రవాలు, ప్రళయాలను ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తాయి. తద్వారా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ప్రకృతి విపత్తలు తలెత్తే సమయంలో ఇలాంటి వాటిని ముందుగా అందించడం వల్ల అధిక ప్రాణ నష్టం జరుగకుండా చూడవచ్చు.
T.V.SRIKAR