తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిలో ఎవరెవరు ఉంటారనే దానిపై క్లారిటీ వచ్చింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రకటించగా.. మహారాష్ట్ర నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశమిచ్చారు.
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో పనిచేయనున్న టీటీడీ పాలకమండలిలోని పలువురి వివాదాస్పద నేపథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి పెనక శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్ లకు అవకాశం ఇవ్వడాన్ని సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ కేతన్ దేశాయ్ విషయానికొస్తే.. ఆయన గుజరాత్‌కు చెందిన యూరాలజిస్ట్ . 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) చైర్మన్ హోదాలో కేతన్ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన పంజాబ్‌లోని ఓ వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చేందుకు రూ.2కోట్లు లంచం తీసుకుంటుండగా సీబీఐ అరెస్ట్ చేసింది. కేతన్ దేశాయ్ నేపథ్యం గురించి 2021 సంవత్సరంలో తిరుపతికి చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ధర్మాసనం కూడా కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయినా ఇప్పుడు మళ్లీ ఆయనకు టీటీడీలో చోటు కల్పించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతోనే కేతన్ దేశాయ్ కు పదేపదే టీటీడీ బోర్డులో అవకాశం దక్కుతోందని అంటున్నారు.
పెనక శరత్ చంద్రారెడ్డి విషయానికొస్తే.. ఆయన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి, ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడు. శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్‌ని బోర్డు సభ్యుల్లో స్థానం కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. ఢిల్లీ మధ్యం కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి నిందితుడిగా ఉంటే, ఎంసీఐ స్కామ్‌లో కేతన్ దేశాయ్ దోషిగా ఉన్నారని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి పవిత్రతను మసకబార్చేలా జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆమె మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోటాలో పొన్నాడ సతీష్, సామినేని ఉదయభాను, తిప్పేస్వామికి టీటీడీ బోర్డులో అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు, సిద్ధవటం యానాదయ్య, కర్నూలు నుంచి సీతారామిరెడ్డి, గోదావరి జిల్లా నుంచి సుబ్బారాజు, ప్రకాశం నుంచి శిద్ధా రాఘవులు కుమారుడు శిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్, అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఖరారయ్యాయి. ఎస్.ఆర్. విశ్వనాథ్ రెడ్డి, రాంరెడ్డి సాముల, సుదర్శన్ వేణు, నెరుసు నాగ సత్యం (ఏలూరు), గడిరాజు వెంకట సుబ్బరాజు (ఉంగుటూరు)లకు కూడా టీటీడీ పాలక మండలిలో ఛాన్స్ దక్కింది. ఇక మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండే కు అవకాశం కల్పించారు.